MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, ఏప్రిల్9 : కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను రేషన్ దుకాణాల్లో ఏర్పాటుచేసి రేషన్ దుకాణాలను సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను నియోజకవర్గంలోని ప్రతీ రేషన్ దుకాణాలకు పంపించి వాటిని ఖచ్చితంగా పెట్టాలని, లేకపోతే మీ సంగతి చూస్తామని రేషన్ డీలర్లను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒక వేళ అధికారికంగా నిర్వహించినట్లయితే ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీల్లో సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ల ఫోటోలు ఉండాలని గుర్తుచేశారు. ఇలా కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రతీ గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని.. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల్లో పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తే వారికి రేషన్ బియ్యం పంపిణీ చేయడం అడ్డుకుంటున్నారని గుర్తుచేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని వెల్లడించారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో 30 శాతం నూకలు వస్తున్నాయని లబ్దిదారులు చెబుతున్నారని అన్నారు. అలాగే వరి కోతలు మొదలయ్యాయని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారని, ఇప్పటి వరకు ఇవ్వలేదని.. తక్షణమే అందజేయాలన్నారు.
రైస్ మిల్లులకు తరలించాలని..
గతంలో కాకుండా రైస్‌మిల్లర్లను అలర్ట్ చేసి వచ్చిన ధాన్యం వచ్చినట్లు రైస్‌మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. గత పంటకు సంబంధించిన సుమారు రూ.7 కోట్ల బోనస్‌ను రైతుల ఖాతాలో వేయాలని, ప్రస్తుత పంటకు మద్దతు ధర కల్పిస్తూ బోనస్ పూర్తిగా అందజేయాలని వెల్లడించారు. అలాగే ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా డబ్బులు చాలా మంది రైతులకు అందలేదని.. తక్షణమే అందరికి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, రింగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ