Child | నర్సాపూర్, మే 19 : వైద్యం వికటించి 8 నెల పసికందు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు దంపతుల కుమారుడు మణివర్ధన్ (8 నెలలు)కు సోమవారం 3 గంటల సమయంలో జ్వరం వచ్చిందని నర్సాపూర్ పట్టణంలోని అమ్మ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం బాలుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్సలు జరిపారు.
అయితే మంగళవారం ఉదయం డాక్టర్లు మణి వర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. వెంటనే కుటుంబీకులు బాలుడిని అంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సంగారెడ్డి ఆసుపత్రిలో అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు చెప్పారు. అమ్మ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని అంతకు ముందే బాలుడు అమ్మ హాస్పిటల్ లోనే మృతి చెందగా.. కావాలనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు.
8 నెలల బాలుడు మణివర్ధన్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తూ అమ్మ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. కాగా రెండున్నర లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.