హాజీపూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ (ముల్కల్ల)లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో సేకరించిన చెత్తను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వివిధ ప్రాంతాల్లో డంపింగ్ చేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్రీడా ప్రాంగణాలు, స్మశానవాటికల సమీపంలో చెత్తను పడేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు చెత్తతో సంపద సృష్టించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను సమకూర్చింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు తరలించేవారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి రైతులకు అందించడంతోపాటు.. పొడి చెత్తలోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరేది. అయితే ముల్కల్లలోని సెగ్రిగేషన్ షెడ్ ప్రస్తుతం వినియోగానికి నోచుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.

Mulkalla2
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సేకరిస్తున్న చెత్తను నిర్దేశిత డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా.. ముల్కల్లలోని పలు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ యువత క్రీడల వైపు మళ్లేలా గతంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు, సమకూర్చిన క్రీడా సామగ్రి సైతం ప్రస్తుతం పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. వాటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Mulkalla3
మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ముల్కల్లలో చెత్తను నిర్దేశిత డంపింగ్ యార్డుకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. సెగ్రిగేషన్ షెడ్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతోపాటు స్మశానవాటిక, క్రీడా ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.