Paddy Grain | నర్సాపూర్, అక్టోబర్ 25 : రైతన్నలు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీసుకువచ్చిన ధాన్యం కాస్తా కురిసిన వర్షానికి నీటి పాలైంది.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం విపరీతమైన వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి కండ్ల ముందు తడుస్తున్న వరి ధాన్యాన్ని చూస్తూ రైతన్నలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా కాంటాలు ఏర్పాటు చేయక, ధాన్యం కొనుగోలు చేయక నిర్లక్ష్యం వహించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని రైతులు వరి కోత పట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు.
వారం రోజులుగా వరి ధాన్యాన్ని ఆరబెడుతూ వచ్చారు. కాని శనివారం కురిసిన భారీ వర్షానికి ఆరబెట్టిన ధాన్యం కాస్తా వర్షార్పణం అయ్యింది. అదే గ్రామానికి చెందిన రెడ్యా అనే రైతు 4 రోజుల క్రితం ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి ఆరబెట్టగా.. శనివారం కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది. వర్షంలో ధాన్యం తడిసిపోవడంతో రైతు రెడ్యా దంపతులు లబోదిబోమన్నారు.
ఐదు రోజులవుతున్న పట్టించుకునే నాధుడే లేడు : రెడ్యా, బ్రాహ్మణపల్లి రైతు
ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి ఐదు రోజులవుతున్నా పట్టించుకునే నాధుడే లేదు. ఇటువైపు ఏ అధికారి, సిబ్బంది రావడం లేదు. నాలుగు ట్రాలీల వడ్లు తీసుకువచ్చాను. టార్పాలిన్లు ఇవ్వమన్నా ఏ ఒక్కరు కూడా ఇవ్వడం లేదు. 14 టార్పాలిన్లు అద్దెకు తీసుకువచ్చి వడ్లు ఆరబెట్టాను. నా కష్టం ఈ టార్పాలిన్లకే అయేతట్టు ఉంది. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేకపోతే ఈ వర్షాల కారణంగా చాలా నష్టపోతాము.


Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Shreyas Iyer: డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్.. కానీ గాయపడ్డ అయ్యర్.. వీడియో