Edupayala Durgamma Temple | పాపన్నపేట, అక్టోబర్ 5 : వరద బీభత్సం సృష్టించడంతో ఏడుపాయల ఆలయానికి కనీవినీ ఎరగని రీతిలో సుమారు కోటి రూపాయల నష్టం సంభవించింది. ఆలయ మంటపానికి ఉన్న గ్రిల్స్ , జనరల్, వీఐపీ క్యూ లైన్స్, మంటపం రేకులు వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసం కావడంతో, ఆలయ ముఖచిత్రం పూర్తిగా అస్తవ్యస్థంగా మారింది. ఆలయ అధికారులు సరైన సమయంలో స్పందించి గ్రిల్స్ తొలగించి ఉంటే ఆలయానికి తీవ్ర నష్టం జరగకుండా ఉండేదని పలువురు భక్తులు వాపోతున్నారు.
సంబంధిత ఆలయ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా, చుట్టపు చూపుగా విధులకు హాజరుకావడమే కాకుండా ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఆలయానికి భారీ నష్టం సంభవించిందని భక్తులు ఆరోపిస్తున్నారు. నిజానికి వాతావరణ శాఖ , నీటి పారుదల శాఖ అధికారులు భారీ వర్షాలు సంభవిస్తాయని ముందస్తుగా హెచ్చరించారు. దీంతో సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు పెద్ద ఎత్తున నిజాం సాగర్ ప్రాజెక్టు కు విడుదల చేస్తామని ముందస్తు సూచనలు చేసినప్పటికీ ఆలయ అధికారుల నిర్లక్ష్యమా, అలసత్వమో కానీ ఆలయ మంటపానికి తొలగించాల్సిన గ్రిల్స్ తొలగించక పోవడంతో వరద ఉధృతితో గ్రిల్స్ విరిగి వరదల్లో కొట్టుకు పోయాయి. దీంతో సుమారు కోటి రూపాల నష్టం సంభవించిందని ఆలయ ముఖ్య ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
ప్రతి ఏటా వర్షా కాలం సంభవించిన వెంటనే ఆలయానికి వరద తాకిడి ఏర్పడుతుందని తలంచి. గత నాలుగు ఏళ్ళ నుండి ఆలయ మంటపానికి వరదల నుండి నష్టం వాటిల్లకుండా గ్రిల్స్ దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని తొలగించి మళ్లీ అమరచడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అప్పటి ఆలయ ఈవో సార శ్రీనివాస్, గ్రిల్స్ ను అవసరాన్ని బట్టి విప్పి భద్రపరిచి మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా గ్రిల్స్‌కు పట్టాలను, నట్టు బోల్ట్‌ను ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేవారు.
గ్రిల్స్ తొలగించి భద్రపరుస్తూ ఉండేవారు..
సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు వదిలినప్పుడు ఆలయ మంటపానికి ఉన్న గ్రిల్స్ తొలగించి భద్రపరుస్తూ ఉండేవారు. మళ్లీ వరదలు తగ్గిన వెంటనే వాటిని తిరిగి ఆలయ మంటపానికి బిగించేవారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 12న సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నీరు వదులుతున్నట్టు ముందే సంబంధిత శాఖ అధికారులు సూచించినప్పటికీ.. ఆలయ అధికారులు కేవలం హుండీలను ఆలయం నుండి తొలగించి భద్రపరిచారే తప్ప ఆలయ మంటపానికి ఉన్న గ్రిల్స్ తొలగించకపోవడంతో ఆగస్టు 14న ఆలయం జలదిగ్బంధంలోకి వెళ్లి సుమారు 52 రోజుల పాటు ఆలయం మంజీరా ఉధృతిలో ఉండిపోయింది. దీంతో రాజగోపురంలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
అయితే గత రెండు రోజుల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఆలయం జలదిగ్బంధం నుండి విముక్తి పొందింది. అయితే ఆదివారం ఆలయ సిబ్బంది ఆలయానికి వెళ్లి పరిశీలించగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఆలయాన్ని శుద్ధి చేసే పనిని ప్రారంభించారు. అయితే ఆలయ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఆలయ మంటప గ్రిల్స్ వరద తాకిడికి ధ్వంసం అయ్యాయని పలువురు భక్తులు అధికారులపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఆలయ అభివృద్ధికి పాటు పడాల్సిన అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్షల సొత్తు వృధా అయ్యిందని భక్తులు వాపోతున్నారు.
వరదలతో అమ్మవారి ఆలయం ఇలా..
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్
YS Jagan | ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు