Collector Rahulraj | టేక్మాల్, నవంబర్ 4 : పత్తి రైతులకు కాటన్ కాపాస్ యాప్‌పై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పెద్దశంకరంపేట డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులకు టేక్మాల్ రైతు వేదికలో మంగళవారం కాటన్ కాపాస్ యాప్ గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. పెద్దశంకరంపేట డివిజన్ పరిధిలో 21,193 మంది రైతులు 34,903 ఎకరాలలో పత్తి పంట సాగు చేశారని తెలిపారు. ప్రతి గ్రామంలో కాటన్ కాపాస్ యాప్ గురించి పత్తి సాగు చేసిన రైతులందరికి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రైతులు దళారులకు పత్తిని అమ్మి మోసపోకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లులో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు ఏఎంసీ వారిగా లోకల్ కమిటీలను నియమించుకుని రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలన్నారు. అదే విధంగా లీగల్ మెటీరియాలజీ అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలని సూచించారు. సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జీన్నింగ్ మిల్లు యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ఏ చిన్న ప్రమాదం జరుగకుండా అగ్నిమాపక శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం కింద 100శాతం రాయితీపై జొన్న విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, ఇంచార్జి ఏడీఏ రాంప్రసాద్, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు ఉన్నారు.


Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో