అన్నపూర్ణ స్టూడియో ఆధ్వర్యంలో సాంకేతికపరంగా భారతీయ సినీరంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున, నిర్మాత శోభు యార్లగడ్డ స్థాపించిన మిహిరా విజువల్ ల్యాబ్‌లో ‘ఏ అండ్ ఎమ్’ మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీని బుధవారం ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రారంభించారు. ‘వారణాసి’లోని కీలక సన్నివేశాలను ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా తెరకెక్కించినట్లు ఆయన వెల్లడించారు. హాలీవుడ్లో ప్రఖ్యాత మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ భాగస్వామి అయిన యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ ఈ ల్యాబ్‌కు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నది.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘భారతీయ సినీ ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టం. ప్రపంచస్థాయి కథలను చెప్పాలని భారతీయ దర్శకులు కలలు కంటున్నారు. అయితే వారికి అత్యాధునిక సాంకేతిక వసతుల కొరత ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ ల్యాబ్ అందుబాటులోకి రావడం వల్ల ఎపిక్ అడ్వెంచర్ నుంచి సైన్స్ ఫిక్షన్ డ్రామాల వరకు ఎన్నో కథలను సులభంగా తెరకెక్కించవచ్చు’ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మిహిరా ల్యాబ్‌ను తీర్చిదిద్దామని నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. భారతీయ సినిమాలో 50 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సదుపాయాన్ని ప్రారంభించారు.