MLA Sunitha Lakshma Reddy | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గం నుండి 60 బస్సులు 180 కార్లతో రజతోత్సవ సభకు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు ఎండలు అధికంగా ఉండడం, సభ జరిగే స్థలం దూరంగా ఉండడంతో గ్రామాల నుండి పరిమిత సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలిరావాలని అన్నారు. ఉదయం 11 గంటల వరకు మండల కేంద్రమైన వెల్దుర్తికి చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా ఎల్కతుర్తి సభకు రావాలని నాయకులకు సూచించారు.
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే సందేశం వినడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, సభకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ సందేశాన్ని గ్రామాలకు వెళ్లి గడప గడపకు వివరించాలని అన్నారు. అమలు కాని 420 హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర గడుస్తున్నా హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు.
సాధారణంగా ఎమ్మెల్యేలకు వచ్చే నిధులను సైతం మంజూరు చేయడం లేదని..నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసిన అధికారులకు ప్రతిపాదనలు పంపినా ఎలాంటి స్పందన లేదని, నిధుల విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుష్టపాలనను చేస్తుందని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నిండా ముంచిందన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండి వారి సమస్యలపై పోరాటాలు చేసి అభివృద్ధి పనులను సాధించుకోవాలని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
మల్లన్న గుట్ట వద్ద ప్రత్యేక పూజలు..
మండల పరిధిలోని బస్వాపూర్ పంచాయతీ శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం మల్లన్న గుట్ట వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వయంబు శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాయకులు భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, రమేష్ గౌడ్, పడిగే నరసింహులు, అశోక్ రెడ్డి, తోట నరసింహులుతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం