బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ(Karnataka Ex DGP) ఓం ప్రకాశ్ హత్యకు చెందిన కొన్ని డిటేల్స్ బయటకు వచ్చాయి. అతని భార్య పల్లవి అతన్ని చంపినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత.. భర్త ఓం ప్రకాశ్ ముఖంపై భార్య కారంపొడి చల్లింది. ఆ తర్వాత కత్తితో భర్తను కసి తీరా పొడిచినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని తన నివాసంలో ఆదివారం కర్నాటక మాజీ డీజీపీ హత్యకు గురయ్యారు. ఈ మర్డర్ కేసులో భార్య పల్లవి అనుమానితురాలిగా ఉన్నారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీజీపీ కూతురు కీర్తిని కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన ఓం ప్రకాశ్ 1981 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. బెంగుళూరులోని విలాసవంతమైన హెచ్ఎస్ఆర్ లేవుట్‌లో మాజీ డీజీపీ ఇళ్లు ఉన్నది.
మాజీ డీజీపీ భారీ కాయుడు కావడం వల్ల కారం చల్లడంతో అతను ఉక్కిరిబిక్కిరయ్యాడు. అయితే కళ్ల మంటతో ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. భార్య పల్లవి కత్తితో పలుమార్లు భర్తను పొడిచేసింది. ఆ స్పాట్లోనే అతను చనిపోయినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. భర్తను చంపిన ఆవేశంలో పల్లవి ఓ మిత్రురాలికి వీడియో కాల్ చేసింది. రాక్షసుడిని చంపేశానని ఆమె ఆ వీడియో కాల్లో చెప్పింది. అయితే ఇటీవల కొన్నాళ్ల నుంచి డీజీపీ దంపతుల మధ్య గొడవలు అవుతున్నాయి. ఆ దంపతులు మూడు అంతస్తుల బిల్డింగ్‌లో ఉంటున్నారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో భర్తపై భార్య అటాక్ చేసినట్లు తెలిసింది. లంచ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మర్డర్ జరిగింది. రెండు కత్తులతో కనీసం ఆరుసార్లు మెడలో, నెత్తి వెనుకు భాగంలో పొడిచింది.
ఫ్యామిలీలో ప్రాపర్టీ ఇష్యూ ఉన్నట్లు తెలిసింది. కర్నాటకలోని దండేలిలో ఉన్న భూమి కోసం ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌పై ఫిర్యాదు చేసేందుకు కొన్ని నెలల క్రితం హెచ్ఎస్ఆర్ లేవుట్ పోలీసు స్టేషన్‌కు ఆయన భార్య పల్లవి వెళ్లింది. ఆ పోలీసు స్టేషన్ సిబ్బంది ఆమె ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో ఆమె అక్కడే ధర్నా చేపట్టింది. పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించింది.
పల్లవికి చాన్నాళ్ల నుంచి ఆరోగ్యం సరిగా లేదు. ఆమెకు షిజోఫ్రేనియా ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధి చికిత్స తీసుకుంటోందామె. 68 ఏళ్ల రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ స్వస్థలం బీహార్‌లోని చంపారన్. అతను జియాలజీ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. మార్చి 1, 2015 నుంచి బెంగుళూరు డీజీపీగా చేశారు.
పూర్తి విచారణ తర్వాత హత్య వివరాలు తెలుస్తాయని కర్నాటక హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర్ తెలిపారు.