MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, డిసెంబర్ 27: రూ.100 కోట్లు పెట్టి మనువడితో ఫుట్‌బాల్ ఆడడానికి డబ్బులు ఉంటాయి కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండవా..? అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘాటుగా విమర్శించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని.. అలాగే నిర్మాణంలో ఉన్న 248 ఇండ్లను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద లబ్దిదారులతో కలిసి శనివారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్లను ఇవ్వడం లేదని కొందరు పేద ప్రజలు తన వద్దకు వచ్చి మొర ఆలకించుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరితో పేద ప్రజలకు అందాల్సిన డబుల్ బెడ్రూం అందని ద్రాక్ష పుల్లనా అనే విధంగా మారిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు అన్ని వసతులు కల్పించేలా డబుల్ బెడ్రూంలను నిర్మించారని తెలిపారు. స్థలం లేని, గుడిసెలు కలిగిన, కిరాయి ఇంట్లో ఉంటున్న నిరుపేదలకు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలని కేసీఆర్ నర్సాపూర్ డబుల్ బెడ్రూమ్స్ కట్టించారని గుర్తుచేశారు.
పేదలకు పంపిణీ చేయడంలో ఏం బాధ అవుతుందో..?
ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూంలను పక్కన పెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అని… ప్రభుత్వం మారగానే అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిలిపివేయవద్దని వెల్లడించారు. ట్రాన్స్ ఫార్మర్ మినహా అన్ని పనులు పూర్తయిన డబుల్ బెడ్రూంలను పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదోనని ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు. 2017వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి 500 డబుల్ బెడ్రూంలను మంజూరు చేయడం జరిగిందని, ఇందులో మొదటి ఫేజ్‌లో 27 బ్లాకులలో ఒక్కో బ్లాకుకు 12 ఇండ్ల చొప్పున మొత్తం 252 ఇండ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ, కరెంట్, సీసీ రోడ్డు, సంపు కేసీఆర్ హయాంలోనే పూర్తి చేయడం జరిగిందన్నారు.
కాంగ్రేస్ అధికారంలోకి వచ్చాక పేదలకు పంపిణీ చేయడంలో ఎం బాధ అవుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడి పేద ప్రజలు కనపడడం లేదా… లేక కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోవాలనుకుంటున్నారా అర్ధం కావడం లేదని చురకలంటించారు. గతంలో ఇదే స్థలంలో 1368 ఇంటి స్థలాలకు సంబంధించిన సర్టిఫికేట్లను నేనే స్వయంగా పంపిణీ చేయడం జరిగిందని, ఇదే స్థలంలో ఇండ్లను నిర్మించి ఓ కాలనీగా ఏర్పాటు చేయాలని డబుల్ బెడ్రూమ్లను నిర్మించడం జరిగిందన్నారు. పూర్తియిన ఇండ్లను పంపిణీ చేయడంలో కాంగ్రేస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఫేజ్-2లో 248 ఇండ్లు ఇవ్వడం జరిగిందని, అవి కూడా వివిధ స్టేజ్లలో ఉన్నాయని అన్నారు. అవి కూడా పూర్తి చేస్తే 500 ఇండ్లు పేదలకు పంపిణీ చేసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే దాదాపు 4 వేల మంది పేదలు ఇండ్లు ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఇవే కాకుండా ఖాళీ స్థలాలను చూసి ఇండ్లను ఇప్పించే బాధ్యత తనదని హామి ఇచ్చారు.
పూర్తియిన ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని ఇప్పటికే మంత్రిని, ఇంఛార్జ్ మంత్రిని, కలెక్టర్‌ను కోరడం జరిగిందని వారి నుండి ఎలాంటి స్పందన లేదని అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వడానికి కాంగ్రేస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు సరిపోదా అని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటా క్రింద 1400 ఇండ్లు ఉంటాయని, నర్సాపూర్ పట్టణంలో, నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇండ్లను మంజూరు చేయాలని లీస్ట్ పంపిస్తే దాన్ని పక్కన పెట్టారని ఆవేధన వ్యక్తం చేశారు. కాంగ్రేస్ పార్టీ రాజకీయం చేస్తూ పేద ప్రజలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రేస్ నాయకులు మీ వద్దకు వచ్చి ఇండ్లు ఇస్తామని అంటారు వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. కాంగ్రేస్ పార్టీ రాజకీయం చేస్తే… కేసీఆర్ మాత్రం ప్రతి ఒక్కరి కడుపు చూశారన్నారు.
తాళాలు పగులగొట్టి కబ్జా చేద్దాం..
కరోనా కాలంలో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇచ్చి 2500 అందించి ఆదుకున్నాడని గుర్తుచేశారు. ఎన్నికలు ఉన్న చోట్ల చీరలను ఇచ్చారు లేని చోట మరిచారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, రోడ్లు, డ్రైనేజ్‌కు రూ.40 కోట్లు ఇస్తే కాంగ్రేస్ అధికారంలోకి వచ్చి రద్దు చేసిందని గుర్తుచేశారు. సిద్ధంగా ఉన్న 252 డబుల్ బెడ్రూంను పేదలకు పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ తర్వాత తాళాలు పగులగొట్టి కబ్జా చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మనువడు ఫుట్‌బాల్ ఆడడానికి 100 కోట్లు ఉంటాయి కానీ, ఫేజ్ 2లోని 248 ఇండ్లను పూర్తిచేయడానికి కేవలం రూ.12 కోట్లు లేవా..? అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కాంగ్రేస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి నర్సాపూర్ మున్సిపాలిటీలో గులాబి జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం డబుల్ బెడ్రూంల నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు లబ్దిదారులతో భారీ ర్యాలీ చేపట్టి చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు నాగరాజు గౌడ్, సత్యాగౌడ్, ప్రసాద్, షేక్ హుస్సేన్, వంజరి శ్రీనివాస్ మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.



Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్టీ డౌన్.. 23 శాతం పడిపోయిన ఇండ్ల అమ్మకాలు
పాలమూరు ప్రాణం మీదికొస్తే శంఖారావమే!
Gold Price | ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ధర 1.42 లక్షలు