పల్లేర్ల కల్లంలోకి మళ్లీ పాలమూరును, కన్నీళ్ల కాలంలోకి తెలంగాణను పడదోసే పన్నాగాలను కేసీఆర్ బయటపెట్టిన తర్వాత ఊహించిన విధంగానే కుట్రదారులు, అసమర్థుల ఐక్య కార్యాచరణ తెరమీదకు వచ్చింది. దానిలో భాగంగానే కోస్గిలో వికృత ఉపన్యాసం ప్రసారమైంది. దాని వెనుక నీటి దోపిడీ చర్చను దారిమళ్లించి, దూషణల చుట్టూ తిప్పి తప్పించుకోవాలనే దుర్బుద్ధే దాగి ఉన్నది.
ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోతైన చర్చ జరిగిన అనంతరం కేసీఆర్ రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలను ఆవేదనతో చర్చకు పెట్టారు. తెలంగాణ నదులపై జల జలగలు విసురుతున్న కుయుక్తుల వలలను విడమరిచి చూపెట్టారు. మోదీ సర్కార్ తలపై బాసింపట్టు వేసుకొని తిష్టవేసిన బాబు సర్కార్, మరోసారి రాష్ట్ర నదీ బేసిన్ల బలికోరుతున్న తతంగాన్ని అందరి ముందూ ఆవిష్కరించారు.
ఏపీ సర్కార్ కుయుక్తులకు కేంద్ర సర్కార్ అందిస్తున్న తోడ్పాటును, రాష్ట్ర సర్కార్ అసమర్థతను ఎండగడుతూ తెలంగాణకు నష్టం తలపెట్టాలనుకుంటే తోలు తీస్తామని ఆ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. అయితే ప్రభుత్వాల మెడలు వంచుతామని, పాతరేస్తామని, తోలు తీస్తామనే సాధారణ రాజకీయ విమర్శలు కొత్తగా మొన్ననే కేసీఆర్ రాజకీయాల్లో కనిపెట్టినవేం కాదు కదా..? పైగా ఆ విమర్శల్లో ఆగ్రహమే తప్ప, అసభ్యత ఆవగింజంత కూడా లేదు. కానీ, కోస్గీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ రంగంలో గతంలో ఏ కీలక నేత కలలో కూడా వాడటానికి ఇష్టపడని జగుప్సాకర భాషను ఉపయోగించారు. అయితే, ఈ రోత రోగం రేవంత్‌రెడ్డికి కొత్తగా సోకిందేమీ కాదు, కాకపోతే రోజురోజుకూ ముదిరిపోతున్నదంతే. ఇటీవల గ్రూప్ వన్ అధికారులకు నియామక పత్రాలు ఇచ్చే వేదికపై మొదలుకొని, తాజాగా నూతన సర్పంచుల సన్మాన సభలో బాధ్యతాయుత కర్తవ్యోన్ముఖులవుతున్న వారికి ఏ సందేశమివ్వాలనే ఇంగితం కూడా కరువై విషం కక్కుతూ ముఖ్యమంత్రి పదవి విశిష్టతను వీధుల్లో వేళాకోళపు చర్చకు దిగజారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం పాలనా సౌలభ్యం కోసమో, భాషా ప్రయుక్తం కోసమో ఏర్పడినది మాత్రమే కాదు, చారిత్రక విద్రోహం ఊబిలో త్యాగాల కరవాలం నాటి వికసించిన స్వరాష్ట్రమిది.
వైవిధ్యమైన ఇలాంటి రాష్ట్రంలో అనుకోని పరిస్థితుల్లో అసమర్థ సర్కార్ కొలువైనా జనాలు సర్దిచెప్పుకొనేవారేమో గానీ, కనీస సంస్కారమెరుగని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహారశైలిని జీర్ణం చేసుకోలేక తలలు పట్టుకుంటున్నారు. పైగా కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి భాషను కేసీఆరే మొదలుపెట్టారంటూ రేవంత్‌రెడ్డిని వెనకేసుకొని రావడానికి వక్రభాష్యాలు వల్లెవేస్తుండటం
అందరికీ అసహ్యం కలిగిస్తున్నది.
ఉద్యమ సందర్భంలో భావోద్వేగాల సంధికాలంలో సైతం ప్రసంగాలను భాస్వరంలా ఉపయోగించారే గానీ రేవంత్‌లా అమ్మ, అవ్వ దూషణలకు దిగజారలేదు. అయితే, ఇలా వక్రభాష్యాలు వల్లిస్తున్న కొన్ని మీడియా యాజమాన్యాల వెనుక, విషవాగుడు కొనసాగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందు ఎవరి ప్రయోజనా లు దాగున్నాయో ప్రజలు అర్థం చేసుకోలేరా?
బుధవారం నాడు కొడంగల్‌లో కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి వాడిన పదాలు విని రాష్ట్రంలోని ఏ మహిళైనా హర్షిస్తుందా? కనీసం వాటిని వింటే ఆయన కన్నతల్లి అయినా అసహ్యించుకుంటుందనే ఆలోచన కూడా లేకుండా రేవంత్‌రెడ్డి దిగజారి, ఆయనొక్కరే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీని కూడా బజారునపడేశారు. గడిచిన రెండేండ్లుగా ఈ విధమైన అసహ్యకర, అసమర్థ సర్కార్ పెద్దల వైఖరి కారణంగానే మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలను దాటి ప్రజలు హస్తం పార్టీకి చుక్కలు చూపించారు. దానివల్లనే పార్టీల గుర్తులతో జరిగే స్థానిక సంస్థల మిగతా ఎన్నికలు జరపడానికి జడుస్తున్నారు.
కీలకమైన సర్పంచ్ ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్లను అటకెక్కించిన తర్వాత అలంకారప్రాయమైన మిగతా లోకల్‌బాడీ పదవుల్లో వాటిపై చర్చ సాకుతో కాలయాపన చేయడం రేవంత్‌రెడ్డి సర్కార్ భయాన్ని బట్టబయలు చేయడం లేదా? పైగా కోస్గిలో ఏకపాత్రాభినయం పోషిస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలుంటే 80 సీట్లు,153కి పెరిగితే 100కి పైగా స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి గప్పాలు కొట్టడాన్ని టీవీల్లో చూసిన వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. వాస్తవానికి ఎవరిని కదిలించినా వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ దొరికినోడే ధన్యుడని, కారు గుర్తు తెచ్చుకుంటే చాలు ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్టు వివరిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రికి తెలియదా అంటే కుర్చీ ఎక్కినప్పటినుంచే వ్యతిరేకత వెన్నంటే ఉంటుందని ఏ అసమర్థ సర్కార్‌కు అయినా అంచనా ఉండకుండా ఉంటుందా? ఆ స్పష్టత ఉండే కులాల విభజన, విష ప్రవచనాల వంతెన నిర్మించుకొని గట్టెక్కే పైశాచిక రాజకీయ పాచికను రేవంత్‌రెడ్డి సర్కార్ నమ్ముకొని ఆచరిస్తున్నది.
అసలు రేవంత్‌రెడ్డికి ఉమ్మడి పాలమూరు జిల్లా గతంలో అనుభవించిన వేదనపై అవగాహన ఉంటే ఇలా నీటిని దారిమళ్లించే నయవంచనకు సహకరించేవారే కాదు. రెండేండ్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కన పెట్టడమే కాదు, ప్రయోజన లక్ష్యాలను సైతం దెబ్బతీసే పాలనా చర్యలకు పాల్పడ్డారు. నిజానికి నల్లమల బిడ్డనని పదేపదే ప్రగల్భాలు పలుకుతున్న దాంట్లో పావువంతు చిత్తశుద్ధి సొంత జిల్లాపై ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన సాగునీటి పథకాలను మరింత వేగవంతంగా పూర్తి చేసేవారు. అలాగే చంద్రబాబు నైజం తెలిసిన ఏ పాలకుడైనా ఏపీలో బాబు సర్కార్ కొలువుదీరగానే, జలవనరుల అంశంలో అప్రమత్తమవుతాడు. 2014 నుంచి 2019 మధ్య తెలంగాణ తొలి అడుగుల్లోనే ఖమ్మం జిల్లా గ్రామాలతో పాటు కృష్ణా, గోదావరి నదులనూ చెరబట్టేందుకు నాటి ఏపీ సర్కార్ కనికరమే లేకుండా ఎన్ని అవాంతరాలు సృష్టించిందో తెలిసిందే కదా..? అన్నీ తెలిసి కూడా ఆదిత్యనాథ్ దాస్‌ను కాంగ్రెస్ సర్కార్ సలహాదారుగా నియమించుకోవడం వెనుక ఆంతర్యం ఎవరికైనా అర్థం కాకుండా ఉంటుందా? పోలవరం-నల్లమల సాగర్‌లో తెలంగాణ వాటా తేల్చకుండానే వేగంగా కసరత్తు కొనసాగిస్తూ, పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను వెనక్కి పంపేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎప్పటికీ తన వ్యతిరేక వైఖరి మారనే మారదని చంద్రబాబు సర్కార్ బహిరంగంగానే చెప్తున్నది. ఇలా మళ్లీ తెలంగాణను తల్లడిల్లేలా చేసే కుయుక్తులు పన్నుతున్న బాబు-మోదీ సర్కార్లను ఎండగడితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎందుకో నిద్ర కరువవుతున్నది. రాహుల్‌గాంధీని బీజేపీ నేతలు బండబూతులు తిట్టినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కోపం రావడం లేదు. కానీ, బాబు-మోదీలను ఏమన్నా అంటే ఎనలేని బాధ కలుగుతున్నది.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మోదీని ఏమన్నా బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్, అరుణలకు ఆవేదన కలగడమే లేదు. కానీ, రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఎవరైనా విమర్శిస్తే మాత్రం వారిపై ఒంటికాలితో లేస్తున్నారు. తెలంగాణ అవసరాల కంటే ఆధిపత్య పైత్యాలకే పాకులాడే ఈ మరుగుజ్జు నేతలు రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత కూడా దివాళాకోరు గుణాలను వదులుకోలేకపోవడం దౌర్భాగ్యం. కనీసం పాలమూరు ప్రయోజనాల విషయంలో అయినా వీరంతా మానవీయతను ప్రదర్శించకపోవడం బాధాకరం.
అసలు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పడ్డ వేదన, తరాల పాటు తరిమిన రోదన కుహనా నాయకులకు అర్థమైతే కదా? ‘నీరు లేక జీవరాశి దూరదేశమెళ్లిపాయె.. పిండకూడు పెట్టిన కూడ దేవదారి తుమ్మతియ్యలో.. అయ్యో పిలిసినొక్క కాకి రాదు దేవదారి తుమ్మతియ్యలో..’ అంటూ నాటి దుస్థితిని పాడుకునేది. పాడి ఆవు లేగ దూడ, తల్లినీ అమ్ముకోని.. దూడనిడువలేక తల్లి అంబా అని అరుస్తుంటే.. ఆవు కంట నీరు చూసి ‘దేవదారి తుమ్మతియ్యలో.. రైతు ఏమి జన్మమని కుమిలెనా’ అంటూ ఊర్లన్నీ వలపోస్తూ దుఃఖించేవి.
అప్పుల నాట్లేసి, ఆత్మహత్యలు పండించుకునే పాలమూరు రైతన్నల దీనస్థితికి చరమగీతం పాడేందుకే కేసీఆర్ 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను 90 శాతం పూర్తి చేశారు. మిషన్ కాకతీయ ద్వారా ఉమ్మడి జిల్లాలో వందలాది చెరువులకు జీవం పోసి, వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించి పాలమూరు పల్లెల్లు పిట్టవాలిన చెట్ల కిలకిలారావాలతో కళకళలాడేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సమైక్యాంధ్ర సర్కార్ల కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కార్‌పై ఇప్పటిలానే వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్న మోదీ ప్రభుత్వం వేధింపులు ఎన్నో చేధించి పాలమూరులో పంటల విప్లవాన్ని సాకారం చేశారు కేసీఆర్. అలాంటి కేసీఆర్‌పై ఎదురుదాడి చేసే ఎత్తులేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం కాంగ్రెస్, బీజేపీ నేతల మూర్ఖత్వం. ఏదేమైనా పాలమూరు ప్రాణం మీదకు వచ్చిన తర్వాత తెలంగాణ పరిరక్షణ పోరుకు శంఖారావం అనివార్యం.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
అసలు రేవంత్‌రెడ్డికి ఉమ్మడి పాలమూరు జిల్లా గతంలో అనుభవించిన వేదనపై అవగాహన ఉంటే ఇలా నీటిని దారిమళ్లించే నయవంచనకు సహకరించేవారే కాదు. రెండేండ్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కన పెట్టడమే కాదు, ప్రయోజన లక్ష్యాలను సైతం దెబ్బతీసే పాలనా చర్యలకు పాల్పడ్డారు. నిజానికి నల్లమల బిడ్డనని పదేపదే ప్రగల్భాలు పలుకుతున్న దాంట్లో పావువంతు చిత్తశుద్ధి సొంత జిల్లాపై ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన సాగునీటి పథకాలను మరింత వేగవంతంగా పూర్తి చేసేవారు.
-డాక్టర్ ఆంజనేయ గౌడ్