Gold Price | న్యూఢిల్లీ, డిసెంబర్ 26: బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం మరో ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఇక పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.2,36,350ని తాకింది. రూ.9,350 అధికమైంది. గత నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.32,250 లేదా 15.8 శాతం ఎగబాకింది. ఈ నెల 19న కిలో ధర రూ.2,04,100గా ఉన్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో వెండి ఏకంగా రూ.1,46,650 లేదా 163.5 శాతం ఎగబాకినట్టు అయింది. డిసెంబర్ 31, 2024న రూ.89,700గా ఉంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర మరో రూ.1,500 ఎగబాకి నూతన రికార్డు స్థాయి 1,42,300కి చేరుకున్నది.
ఈ ఏడాది ఇప్పటి వరకు తులం బంగారం రూ.63,350 లేదా 80.24 శాతం పెరిగింది. డిసెంబర్ 31, 2024న ధర రూ.78,950గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 50.87 డాలర్లు లేదా 1.13 శాతం ఎగబాకి 4,530.42 డాలర్లు పలికింది. ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు దూసుకుపోతున్నాయని షేర్‌ఖాన్ మిరాయ్ అసెట్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. అలాగే ఔన్స్ వెండి తొలిసారిగా 75 డాలర్లు దాటింది.