హైదరాబాద్/న్యూఢిల్లీ, డిసెంబర్ 26: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మందగమనం దిశగా వెళ్తున్నది. భారతీయ ప్రధాన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లలో ఒకటైన అనరాక్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర్నుంచి దాదాపు పదేండ్లపాటు పరుగులు పెట్టిన ఇక్కడి నిర్మాణ రంగం.. గతకొంత కాలంగా కళ తప్పిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం మారినప్పటి నుంచి నెలకొన్న పరిణామాలు.. ఇండ్ల కొనుగోళ్లకు బ్రేకులు వేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలు రియల్టీని ఉత్సాహపరిస్తే.. ప్రస్తుతం మాత్రం ఆ రకమైన ప్రోత్సాహం కరువైందన్న ఆవేదన మెజారిటీ రియల్టర్లలో కనిపిస్తుండటం గమనార్హం.
ఇదీ సంగతి..
ఈ ఏడాది హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు గత ఏడాదితో పోల్చితే 23 శాతం తగ్గాయని అనరాక్ తమ తాజా గణాంకాల్లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాల తీరుతెన్నులపై అనరాక్ ఓ నివేదికను తీసుకొచ్చింది. ఈ నగరాల్లో హౌజింగ్ సేల్స్‌పరంగా అన్నింటికంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ క్షీణత కనిపిస్తుండటం మిక్కిలి గమనించదగ్గ అంశం. 2024లో 58,540 యూనిట్ల విక్రయాలు నమోదైతే..2025లో 44,885 యూనిట్లకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ సహా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పుణె, కోల్‌కతా, చెన్నై నగరాల్లో రెసిడెన్షియల్ సేల్స్‌పై అనరాక్ రిపోర్టు ఇచ్చింది. అయితే చెన్నై మినహా అన్ని నగరాల్లో ఇండ్ల అమ్మకాలు పతనమయ్యాయి.
2024తో పోల్చితే 2025లో 15 శాతం పెరిగి 19,220 యూనిట్ల నుంచి 22,180 యూనిట్లకు చేరుకున్నాయి. దీంతో మొత్తంగా చూసినైట్టెతే 14 శాతం క్షీణత చోటుచేసుకున్నది. 2025లో ఈ ఏడు నగరాల్లో ఇండ్ల విక్రయాలు 3,95,625 యూనిట్లుగానే ఉన్నట్టు తేలింది. 2024లో 4,59,645 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, అధిక ధరలు, ఐటీ తదితర రంగాల్లో ఉద్యోగుల తొలగింపులతో తగ్గిన డిమాండ్, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణమంటూ మార్కెట్ సరళిని అనరాక్ విశ్లేషించింది. అయితే పెరిగిన రేట్ల దృష్ట్యా విలువపరంగా అమ్మకాలు 6 శాతం పెరిగి రూ.6 లక్షల కోట్లకు చేరాయన్నది. నిరుడు రూ.5.68 లక్షల కోట్లే. అలాగే ఈ ఏడు నగరాల్లో ఇంటి ధర సగటున 8 శాతం ఎగిసినట్టు పేర్కొన్నది. సరిగ్గా ఏడాది క్రితం చదరపు అడుగు రూ.8,590 పలికితే.. ఇప్పుడు రూ.9,260గా ఉన్నట్టు అనరాక్ ఈ సందర్భంగా తమ నివేదికలో తెలియజేసింది.
ప్లాటెడ్ డెవలప్మెంట్లపై నజర్
దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లంతా ఇప్పుడు ప్లాటెడ్ డెవలప్మెంట్లపై దృష్టిసారిస్తున్నారు. ఒకప్పుడు అసంఘటిత రియల్టర్లు మాత్రమే ఈ ప్లాట్ల (భూములు) అమ్మకాల్లో ఎక్కువగా ఉండేవారు. ప్రధాన సంస్థలన్నీ భూములను కొని, వాటిలో ఇండ్లు, అపార్ట్మెంట్లు నిర్మించి అమ్ముతుండేవి. అయితే ఇప్పుడు బడా సంస్థలు సైతం పెద్ద ఎత్తున భూములను కొని, వాటిని చిన్నచిన్న ప్లాట్లుగా మార్చి, అన్ని సదుపాయాలు (రోడ్లు, త్రాగునీరు, విద్యుత్తు అనుమతులు) కల్పించి విక్రయానికి పెడుతున్నాయి. డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్, ప్రెస్టీజ్, పురవంకర, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, రుస్తుంజీ తదితర ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలాంటి ట్రెండ్‌నే అనుసరిస్తున్నాయి.
హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వెంచర్లను తీసుకొస్తున్నాయి. హైదరాబాద్ మరికొన్ని నగరాల్లోనైతే ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నది. కాగా, జైపూర్, సోనిపట్, ఇండోర్, నాగ్‌పూర్, కోయంబత్తూర్, మైసూరు, సూరత్, రాయ్‌పూర్ వంటి కొన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ తరహా మార్కెటింగ్ ఊపందుకుంటుండటం విశేషం. నిర్మాణ ప్రాజెక్టులతో ఆదాయం అందుకోవడానికి 4-6 ఏండ్లు పడుతున్నదని, ప్లాటెడ్ ప్రాజెక్టులతో 2-3 ఏండ్లలోనే వ్యాపారం చేసుకుంటున్నామని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కరోనా తర్వాత ప్రవాస భారతీయులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుండటం, ఇండిపెండెంట్ హౌస్‌లకు డిమాండ్ కూడా కంపెనీలను ఈ ప్లాట్ల బిజినెస్ వైపునకు నడిపిస్తున్నది.
ఆఫీస్ స్థలాలకు తగ్గిన డిమాండ్
హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ పడిపోయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్ మధ్యకాలం) నగరంలో ఆఫీస్ స్థలాల డిమాండ్ 19 శాతం పడిపోయి 1.10 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి పడిపోయినట్టు కొలియర్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మెట్రో నగరాలైన బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై, పూణె, కోల్‌కతాలో పెరుగుదల నమోదుకాగా, కేవలం హైదరాబాద్‌తోపాటు ముంబైలో తగ్గుముఖం పట్టినట్టు వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గింపులు, మార్కెట్లో ధరలపైనే వచ్చే ఏడాది ఇండ్ల కొనుగోళ్లు ప్రధానంగా ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. దేశ ఆర్థిక పరిస్థితుల్ని ప్రభావితం చేసే జాతీయ, అంతర్జాతీయ పరిణామాలూ కీలకమే.
– అనుజ్ పురి, అనరాక్ చైర్మన్
