Lashkar-e-Taiba : దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అలాగే ప్రధాన దేవాలయాల్లోనూ అలర్ట్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు దేవాలయాలపై పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా అనే తీవ్రవాద సంస్థ దాడులకు కుట్ర పన్నిందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీతోపాటు ప్రముఖ నగరాలు, ప్రధాన దేవాలయాలు వంటి రద్దీ ప్రదేశాల్ని లష్కరే తొయిబా సంస్థ టార్గెట్ చేసుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాలైన ఎర్రకోట, చాందినీ చౌక్, పరిసర దేవాలయాల్లో ఐఈడీలతో పేలుడుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను మరింత పెంచి హై అలర్ట్ ప్రకటించారు. అన్ని స్థాయిల్లో భద్రతను 24 గంటలు పర్యవేక్షించేలా పార్లమెంటరీ బృందాలు పని చేస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్లో మసీదు వద్ద మానవ బాంబు దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. దీనిలో భాగంగా పాక్కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తొయిబా ఇండియాలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు రహస్య సమాచారం అందింది.
దేశంలోని ప్రధాన దేవాలయాల్ని కూడా ఈ ఉగ్రసంస్థ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయా ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు. లష్కరే తొయిబా సంస్థకు మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్ అయిన హఫీజ్ సయీద్ నాయకత్వం వహిస్తున్నాడు. గత ఏడాది నవంబర్ 25న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కార్ బాంబ్ బ్లాస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మరణించగా, 20 మందికిపైగా గాయపడ్డారు.