.MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, డిసెంబర్ 9 : వయోవృద్ధులను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బందు ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ హానరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రామాయంపేట్ మాజీ ఎమ్మెల్యేలు వాసుదేవరావు, విఠల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వయోవృద్ధులను శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్‌ను మొదలుపెట్టి ముఖ్య అతిథిగా హాజరుకావడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. స్వర్గీయ లక్ష్మారెడ్డి ఆశయసాధన కొరకు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఈ లయన్స్ క్లబ్ ద్వారా గ్రామాలలోని పేదలకు ఉచిత కంటి చికిత్సను అందించడం జరిగిందన్నారు. ఉమ్మడి కుటుంబాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. వయోవృద్ధుల పట్ల ప్రేమ, ఆప్యాయత, మర్యాద పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని వారి ఆస్తులను జప్తు చేసేలా చట్టాలు రావాలని అన్నారు.
మహిళ కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోలేని వారు నన్ను ఆశ్రయించినప్పుడు ఆస్తి తిరిగి ఇప్పించడం జరిగిందని గుర్తుచేశారు. నర్సాపూర్ పట్టణంలో మధ్యలోనే ఆగిపోయిన సీనియర్ సిటిజన్ భవనాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని.. అలాంటి వారిని గౌరవించుకోవాలని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అంతకు ముందు వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కంటి పరీక్షలు చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రావు, జోన్ చైర్మన్ బుచ్చేశా యాదవ్, గవర్నర్ అమర్నాథ్ రావు, సెక్రటరీ అశోక్ కుమార్, ట్రెజరర్ వెంకటస్వామి గౌడ్, పీడీసీ గవర్నర్స్ రామకృష్ణరెడ్డి, ఓబుల్ రెడ్డి, ఆర్గనైజర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
