హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ) : జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి జిల్లా పరిషత్ హైసూల్, మల్దకల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వారా ల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఉండవల్లిలో జడ్పీ హైసూల్ భవనం, మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటోగా పరిగణించి విచారణ చేపట్టింది. రెండేండ్ల క్రితం పనులు చేపట్టారని, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశారన్న అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు, 20మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
గతంలో ఎంపీ మల్లురవి సందర్శించి సీఎస్ఆర్ కింద రూ.కోటి మంజూరు చేయిస్తామని ఇచ్చిన హామీ అమలుకాలేదు. దీనిపై ఉస్మాని యా యూనివర్సిటీకి చెందిన రఫీ హైకోర్టుకు లేఖ రాశారు. గద్వాల జిల్లాలోనే మల్దకల్ జూనియర్ కాలేజీలోనూ మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మరో లేఖ రాశారు. వీటిని పిల్స్‌గా పరిగణించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపిం ది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఇంటర్మీడియట్ విద్యాకమిషనర్, కలెక్టర్, డీఈవో, మల్దకల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, ఉండవల్లి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంకు నోటీసులు జారీ చేసింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.