Toddy Adulteration | పాపన్నపేట, సెప్టెంబర్ 23 : ఇటీవల జహీరాబాద్‌లో జరుగుతున్న ఎన్సీసీ క్యాంపునకు పాపన్నపేట మండలం నుండి వెళ్లిన ఓ పదవ తరగతి విద్యార్థి కల్లు లేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో సంబంధిత అధికారులు ఇంటికి పంపించారు. పాపన్నపేటకు చెందిన ఒక యువకుడు పని మీద మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడ కల్లు దొరకక మానసిక రోగిలా ప్రవర్తిస్తూ బట్టలు లేకుండా తిరిగి చనిపోయాడు. అనాధగా భావించిన అక్కడి స్థానికులు ఖననం చేశారు. అనంతరం జాడ తెలవడంతో పోలీసులు శవాన్ని బయటకు తీసి పాపన్నపేటకు పంపారు.
పాపన్నపేట మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తమ కొడుకు వద్ద లక్ష్మీ నగర్లో ఉంటూ.. అక్కడ కల్లు దొరకక, తీవ్ర మానసిక ఆందోళనకు లోనై.. ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇవన్నీ ఏంటీ అబ్రకదబ్ర కథలు అనుకుంటున్నారా ..? కాదండి కల్తీ కల్లు లీలలు, పాపన్నపేట మండల పరిధిలో కల్తీ కల్లు సృష్టిస్తున్న లీలలు అన్నీ.. ఇన్నీ కావు. కోకొల్లలు. ఏ పల్లె లో.. యే గల్లీలో చూసినా ఇలాంటి భయానక సంఘటనలు కనిపిస్తాయి. ఇలా చెబుతూ పోతే కల్తీ కల్లు కథలు ఇంతా అంతా కాదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణ కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది కానీ, డ్రగ్స్ కు మించిన మహమ్మారిగా మారిన కల్తీకల్లు గురించి కనీసం పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా దసరా పండుగ రావడంతో పట్టణాల నుండి ప్రజలంతా తమ తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన కల్తీ కల్లు వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల వారిని మత్తులో ముంచుతున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా ఇల్లీగల్ షాప్స్ కొందరు నడుపుతుండగా మరికొందరు ఎక్కడ దొరికితే అక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తూ డైజోఫామ్, క్లోరల్ హైడ్రాయిడ్, గంజాయి పౌడర్ లాంటి మత్తు పదార్థాలు కలుపుతున్నారు. ముఖ్యంగా గాజుల గూడెం ఎంకే పల్లి చౌరస్తా , కోడపాక, బాచారం, ఎల్లాపూర్, మల్లంపేట, పొడిచనుపల్లి, అన్నారం, అబ్లాపూర్, మిన్పూర్ తదితర గ్రామాలలో విపరీతమైన కల్తీ జరుపుతున్నారు.
ఎలాంటి లైసెన్సులు లేకుండా..
కాగా కొత్తపల్లి, కుర్తివాడ గ్రామాల్లో అడ్డూ అదుపు లేకుండా కల్లులో ఆల్ఫాజోలం లాంటి మత్తు పదార్థాలు అధిక మొత్తంలో కలపడంతో, యూసుఫ్ పేట, ఆరేపల్లి గ్రామాలకు చెందిన కల్లు ప్రియులు సాయంత్రం అయిందంటే ఆ గ్రామాల బాట పడుతున్నారు. ఇక అరికెల చౌరస్తా రాజ్యా తాండ వద్ద మెయిన్ రోడ్డుపై కల్లు దుకాణాలు పెట్టి పెద్ద ఎత్తున కల్తీకల్లు అమ్మకాలు సాగిస్తున్నారు. మత్తు ప్రాతిపదికన ఫ్రిజ్ లో బాటిల్స్ పెట్టి రూ.20కి ఒక్కటి అమ్ముతున్నారు.
ఆర్కెలలో నైతే ఫ్రిజ్‌లో పెట్టి 30కి అమ్ముతున్నారు. పాపన్నపేట నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరికెల చౌరస్తాకు కల్లు కోసం పరుగులు తీస్తున్నారంటే, మత్తు పదార్థాలకు ఎంతగా అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇక లింగయ్య పల్లి చౌరస్తా వద్ద ఒక కోళ్ల ఫారం వద్ద సైతం ఇల్లీగల్‌గా దుకాణం ఏర్పాటు చేసి కల్లు అమ్ముతున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు తమ గ్రామాలను వదిలిపెట్టి అక్కడికి వచ్చి తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.
కల్లు దుకాణాలలో సీసాల్లో ఎలుకలు వస్తే..
గతంలో మల్లంపేట ,కొత్తపల్లి కల్లు దుకాణాలలో సీసాల్లో ఎలుకలు వస్తే కల్లు ప్రియులు ఆందోళనకు దిగిన సంఘటనలు గమనార్హం. కల్లుపై వార్తలు వస్తే కనీసం స్పందించకుండా సంబంధిత అధికారులు పేపర్లో వార్త వచ్చింది అంటూ సంబంధిత దుకాణాల యజమానులకు ఫోన్లు చేసి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం డ్రగ్స్‌పై అవగాహన కల్పించడానికి ప్రతీ పాఠశాలలో అవగాహన తరగతులు నిర్వహిస్తుంది.
అంతకంటే పెనుభూతమైన కల్తీ కల్లును అరికట్టడంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మనిషిని నిర్వీర్యం చేస్తున్న ఆల్ఫా జోలం.. మత్తు కోసం కల్లులో ఆల్ఫా జోలం లాంటి ప్రమాదకరమైన మత్తు మందు కలుపుతున్నారు. దీని విలువ కిలోకు రూ.7 లక్షలు నుంచి 8 లక్షలు ఉంటుంది. ఒక గ్రామ్ ఆల్ఫా జోలంతో 100 పెట్టెల కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. అసలు చుక్క చెట్టు కల్లు లేకుండానే కల్తీ కల్లు తయారవుతుంది. ఇందులో చక్రీన్ , వైట్ పేస్ట్, లాంటి ప్రమాదకర పదార్థాలు వాడుతున్నారు. దీనికి అలవాటు పడిన మనిషి, కల్లు తాగనిదే ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. మనిషి ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లును అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులపై ఉందని, మహిళలు పేర్కొంటున్నారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి