Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలతో వేలాది మందికి అండగా నిలుస్తున్న ఆయన, ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. భవిష్యత్తులో విద్యాదానంపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తన సేవా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. రక్తం కొరత వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు తనను కదిలించాయని, అందుకే 1998లో బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి అభిమానులను రక్తదానానికి ప్రేరేపించానని తెలిపారు. అదే సమయంలో ఐ బ్యాంక్ సేవలను కూడా ప్రారంభించి అత్యవసర సమయంలో ప్రాణదాతగా నిలిచేలా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు చెప్పారు.
అయితే తన సేవలను అక్కడితో ఆపాలని ఎప్పుడూ అనుకోలేదని, ఇప్పుడు విద్యా రంగంలో సేవలు అందించే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నానని వెల్లడించారు. ప్రముఖ నటుడు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ స్ఫూర్తిగా తీసుకొని, పేదలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఎక్కడైతే విద్య అవసరం ఉంటుందో అక్కడ సహాయం అందించేలా కృషి చేస్తాను అని చిరంజీవి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ విద్యా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలతో పాటు పేదలకు వైద్య సహాయం, ఆర్థిక సాయం అందిస్తున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ, వైద్య సహాయంతో కూడా ఎంతోమందికి అండగా నిలిచారు.
ఈ సేవా కార్యక్రమాలను ప్రస్తుతం ఆయన కుమారుడు రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు. ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. మొత్తానికి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకోవడంతో అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.