Girl Missing | నర్సాపూర్, అక్టోబర్ 19 : షాపింగ్ మాల్‌కు కూలీకని వెళ్లి యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల తులసి (19) నర్సాపూర్ పట్టణంలో గల వీ మార్ట్ లో కూలీ పని చేస్తుంది. రోజు మాదిరిగానే శనివారం నాడు కూలీ పనికి వెళ్లి రాత్రి 8 గంటలు అయినా ఇంటికి తిరిగిరాలేదు.
కుటుంబ సభ్యులు వీ మార్ట్‌కు వెళ్లి ఆరా తీయగా ఆ రోజు తులసి వీ మార్ట్‌కు రాలేదని అక్కడి వారు తెలిపారు. వెంటనే తులసికి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. చుట్టుపక్కల, బంధువుల వద్ద ఎంత వెతికినా తులసి ఆచూకి లభించలేదు.
నర్సాపూర్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన బలిజ రాజు (ఆటోడ్రైవర్)పై అనుమానం ఉందని తులసి తల్లి బొమ్మల లక్ష్మీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు ఇంట్లో నుండి వెళ్లేటప్పుడు గోధుమ రంగు టాప్, తెలుపురంగు లెగ్గిన్స్ , చున్ని ధరించి ఉందని ఎత్తు 5.5, చామనఛాయ రంగు కలిగి ఉంటుందని వారు తెలిపారు. చట్టరీత్య తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ వెల్లడించారు.