Pratima Singh | గురువారం శివంపేట మండల కేంద్రంలోని ఉసిరిక పల్లి గ్రామంలో పోతరాజుల బాలేష్ అనే రైతు తన నాలుగున్నర ఎకరాల పొలంలో సాగు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలను ,సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులు సాగు చేస్తున్న పంటలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నేడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న వరి, కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర పంటలను పరిశీలించి రైతుతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయడం అభినందనీయమన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించడంలో సేంద్రియ వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
మార్కెట్లో మంచి డిమాండ్..
రైతులు తయారు చేస్తున్న జీవామృతం, ఘన జీవామృతం, వర్మీ కంపోస్ట్, సేంద్రియ కషాయాలు తదితర సహజ ఎరువులు తయారీ విధానాలను కలెక్టర్ పరిశీలించారు. పంటల ఎదుగుదల, దిగుబడి పరిస్థితులు, సాగు ఖర్చులు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు మరింత ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సాంకేతిక సూచనలు అందిస్తూ సేంద్రియ సాగును విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీవోలు), రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఆదర్శ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసి ఇతర రైతులకు ప్రేరణ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ధృవీకరణ (సర్టిఫికేషన్), బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించి సేంద్రియ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
రైతుల సంక్షేమం కోసం..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం అత్యంత అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, మండల వ్యవసాయ అధికారిణి లావణ్య, సాంకేతిక వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారిణి సౌజన్య , రైతులు పాల్గొన్నారు.
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’