Collector Rahul Raj | పాపన్నపేట, ఏప్రిల్ 6 : శ్రీరామ నవమి పండుగ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాపన్నపేట సివిల్ సప్లై గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో బియ్యం లేకపోవడంతో సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాపన్నపేట గోదాంకు రావాల్సిన సన్న బియ్యం సగమే రావడంతో వాటిని డీలర్లకు పంపిణీ చేశారు. ఇంకా సగం తొందరగా పంపించాల్సిందిగా స్టేజ్ వన్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని.. వాటిని ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత సిబ్బందికి సూచించారు. సన్న బియ్యంలో చాలా మట్టుకు నూకలు వస్తున్నాయని విలేకరులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, తాము తహసీల్దార్‌ను అడిగితే అన్ని బాగా వస్తున్నాయని చెప్పారన్నారు.
సన్న బియ్యంలో నూకలు వస్తే వెంటనే వాపస్ పంపాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఆయన వెంట స్టేజ్ టు కాంట్రాక్టర్ సుంకరి కిష్టయ్య , పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.