MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, ఆగస్టు 26: యూరియా కోసం రైతుల పక్షాన ధర్నా చేపడితే అరెస్టు చేస్తారా..? అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో యూరియా ఇవ్వడం లేదని రైతులు అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు సంఘీభావంగా వారితోపాటు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం పోలీసులు అక్కడకు చేరుకొని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని, కొంతమంది రైతులను అరెస్టు చేసి నర్సాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా యూరియా అడిగితే అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రైతులకు యూరియాను సక్రమంగా అందజేశారని, రైతులు ఏనాడూ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి లేదన్నారు.
బ్లాక్ మార్కెట్కు యూరియా..
గత ప్రభుత్వంలో మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో కూడా యూరియా పుష్కలంగా దొరికేదని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వలన సరైన ప్రణాళిక లేక యూరియా కొరత ఏర్పడిందని దుయ్యబట్టారు. రైతులు అప్పుచేసి నాట్లు వేస్తే నేడు యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కడుపు మంటతో సద్దులు కట్టుకొని మరి ఫర్టిలైజర్ దుకాణాల ముందు కుటుంబ సభ్యులతో కలిసి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు మూడు లోడ్ల యూరియా కావాలని అడిగినా స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఇంట్లో యూరియా స్టాక్ దొరకడం ఇందుకు నిదర్శనమని, యూరియా కృత్రిమ కొరత సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఘంటాపదంగా చెప్పారు. నర్సాపూర్ మండలంలో ఎలాంటి యూరియా కొరత లేదని తహసీల్దార్ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం సరైనది కాదన్నారు.
అధికారుల దృష్టి ఆకర్షించడానికి వాళ్ల మీద నెపం వేయకుండా ఉండడానికి రైతులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. నిరంతరం రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా అవసరం ఉన్నంత మేర యూరియాను సరఫరా చేసి రైతుల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం