Mallanna sagar | తొగుట, ఆగస్టు 31 : కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ మాగానిలో గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే కాళేశ్వరం కూలిపోయింది, కాలిపోయిందని మాట్లాడుతున్నారని, ఒక్కసారి మల్లన్నసాగర్లో 8 పంపుల ద్వారా నిర్విరామంగా వస్తున్న కాళేశ్వరం జలాలను చూడాలన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలిపోయింది, లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మా హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్‌కు జలాలు వస్తున్నాయని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు.. నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో నిర్మించినయి కావా అని ఆయన ప్రశ్నించారు.. 60 ఏళ్ల పాటు పాలించిన వారికి తెలంగాణ కరువుకాటకాలు పట్టలేవన్నారు. తెలంగాణ వస్తేనే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని మాట్లాడిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించాడన్నారు.
కేసీఆర్ మీద కోపంతో విష ప్రచారం చేస్తూ..
గత యాసంగిలో మల్లన్న సాగర్ నుంచి పది టీఎంసీల నీటిని పంటపొలాలకు వాడుకున్నది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.. గత ప్రభుత్వంలో ఏమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవాలి కానీ కేసీఆర్ మీద కోపంతో విష ప్రచారం చేస్తూ రైతులు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గొప్ప వరమని సొసైటీ చైర్మన్ కే హరి కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమరయ్యలు పేర్కొన్నారు. ఎక్కడో ఉన్న గోదావరిని ఇక్కడికి తీసుకువచ్చి సాగునీరు, తాగునీరు పారిశ్రామిక అవసరాలకు నీరందించిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. విమర్శలు పక్కనపెట్టి మల్లన్నసాగర్ జలాలు పూర్తిగా వినియోగించుకునేలా చిన్న కాలువలు కూడా పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు స్వామి గౌడ్, మహిపాల్ రెడ్డి, స్వామి, బాలరాజు తదితరులు ఉన్నారు.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన