Ear Wax Cleaning | చెవుల్లో మనకు సహజంగానే గులిమి పేరుకుపోతూ ఉంటుంది. ఇది మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే సహజసిద్ధమైన ప్రక్రియ. సాధారణంగా గులిమిని మనం తొలగించాల్సిన పనిలేదు. అదే బయటకు వెళ్తుంది. కానీ కొన్ని సందర్బాల్లో గులిమి గట్టిగా తయారై బయటకు రాదు. దీంతో అది ఇబ్బందిని కలిగిస్తుంది. చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తెచ్చి పెడుతుంది. అయితే కాటన్ బడ్స్ సహాయంతో చాలా మంది చెవుల్లో ఉండే గులిమిని తీస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల చెవుల లోపలి భాగాలకు హాని కలుగుతుంది. చెవి లోపలి భాగం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు కాటన్ బడ్ తగిలితే ఆ సున్నితమైన భాగం దెబ్బ తిని వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక గులిమిని తీసేందుకు డాక్టర్ సలహాను తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా గులిమిని తీసేందుకు కాటన్ బడ్స్‌ను ఉపయోగించాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగానే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెవుల్లో ఉండే గులిమిని తొలగించడంలో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. కనుక చెవుల్లో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెను కొద్దిగా తీసుకుని కాస్త వేడి చేయాలి. ఈ నూనె గోరు వెచ్చగా ఉండగానే 2 లేదా 3 చుక్కలను చెవిలో వేయాలి. తరువాత ఆ చెవి పైకి ఉండేలా తలను కాస్త వంచాలి. ఈ భంగిమలో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉండాలి. చెవి నుంచి నూనె బయటకు రాకుండా అవసరం అయితే కాటన్ బాల్‌ను అడ్డుగా పెట్టవచ్చు. ఇలా ఇంకో చెవికి కూడా చేయాలి. ఈ విధంగా తరచూ చేస్తుంటే చెవుల్లో ఉండే గులిమి మెత్తగా మారి అదే బయటకు వస్తుంది. కాటన్ బడ్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు సెలైన్ ద్రావణం కూడా పనిచేస్తుంది. 1 టీస్పూన్ ఉప్పును అర కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి ఉప్పు బాగా కరిగే వరకు తిప్పాలి. అనంతరం కాటన్ బాల్‌ను ఆ ద్రావణంలో నానబెట్టాలి. తరువాత ఆ బాల్‌ను తీసుకుని దాన్ని చెవిపై పెట్టి చెవిలో ఆ ద్రావణం చుక్కలు పడేలా కాటన్ బాల్‌ను పిండాలి. చెవిని అలాగే 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మరో చెవిలో కూడా ఇలాగే చుక్కలను పిండాలి. ఈ చిట్కాలను పాటిస్తున్నా కూడా గులిమి సులభంగా బయటకు వస్తుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉపయోగించి కూడా చెవుల్లో ఉండే గులిమిని తొలగించుకోవచ్చు. గోరు వెచ్చని నీటిని కొద్దిగా తీసుకుని దానికి అంతే మోతాదులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని కలపాలి. అనంతరం అందులో నుంచి 2 లేదా 3 చుక్కలను తీసుకుని డ్రాపర్ సహాయంతో చెవిలో వేయాలి. దీని వల్ల కొందరికి చెవిలో గుయ్‌మనే శబ్దం వస్తుంది. ఇదంతా సహజమనే అని భావించాలి. అలా ఇంకో చెవిలో కూడా వేయాలి. చెవిలో చుక్కలను వేసిన తరువాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేస్తుండడం వల్ల కూడా గులిమి బయటకు వస్తుంది. అయితే ఈ చిట్కాలను పాటించేటప్పుడు కాటన్ బడ్స్‌ను ఉపయోగించకూడదు అవి చెవుల్లో ఉండే సున్నితమైన భాగాలను తాకితే చెవులు డ్యామేజ్ అయి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. మీకు ఈ చిట్కాలను పాటించడం ఇష్టం లేకపోతే డాక్టర్‌ను కలవడమే ఉత్తమమైన మార్గం.