Vinayaka Mandapam | నర్సాపూర్ : వినాయక మండపం ఏర్పాటుకు ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతి పత్రం పొందాలని ఎస్ఐ లింగం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపం ఏర్పాటుకు ఈ https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా
ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్‌కు దరఖాస్తు కాపీ ఖచ్చితంగా సమర్పించాలని వెల్లడించారు. మండపాలను రహదారులు, అంబులెన్స్ మార్గాలు, అగ్నిమాపక వాహనాల మార్గాలకు అడ్డంకులు కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా అమర్చాలని, షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకొని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరిగా ఉంచాలని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగులు వాడరాదనీ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. లౌడ్స్పీకర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, అధిక శబ్దం, డీజే మ్యూజిక్ వాడరాదని పేర్కొన్నారు. ఊరేగింపుల కోసం ముందస్తు అనుమతి తీసుకుని, పోలీసులు సూచించిన మార్గంలోనే జరపాలని, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాలంటీర్లను నియమించుకోవాలని తెలియజేశారు.
విద్వేషపూరిత ప్రసంగాలు చేయరాదు..
జాతి, మత, కుల భావోద్వేగాలను దెబ్బతీసే నినాదాలు, పాటలు, ప్రసంగాలు చేయరాదని, సఖ్యత, శాంతియుత వాతావరణంలో ఊరేగింపులు కొనసాగించాలని అన్నారు. మండప పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని, పండుగ అనంతరం చెత్తను సక్రమంగా తొలగించాలని సూచించారు. ప్రతీ మండపంలో పగలు, రాత్రి సమయాల్లో కనీసం ఇద్దరు వాలంటీర్లు విధులు నిర్వర్తించాలని, వారు భద్రత, ట్రాఫిక్, పరిశుభ్రత విషయాలను పర్యవేక్షించాలని చెప్పారు.
అవసరం ఉన్న మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు పని చేసేలా చూడాలని రికార్డింగ్ ఫుటేజ్‌ను భద్రపరచాలని తెలిపారు. విగ్రహ నిమజ్జనం అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే జరపాలనీ, నదులు, చెరువులు కలుషితం కాకుండా పర్యావరణ హిత చర్యలు తీసుకోవాలన్నారు. అప్లై చేసే విధానం గానీ లేదా మీ మండపం దగ్గర ఎలాంటి సందేహాలు ఉన్నా 8712657897 (నర్సాపూర్ పోలీస్ స్టేషన్ నెంబర్) కు కాల్ చేయగలరనీ, లేదా మీ గ్రామానికి చెందిన విలేజ్ పోలీస్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవాలని పేర్కొన్నారు. 24/7 పోలీసుల సహాయం కోసం, తక్షణ సహాయం అవసరమైనప్పుడు Dial 100 కి కాల్ చేయగలరని కోరారు. వినాయక చవితి పండుగను ఆనందకరంగా, సురక్షితంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలని తెలియజేశారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి