Kerala SIR : కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళలో చేపట్టిన ‘సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)’ తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ అనంతరం కేరళ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శనివారం తుది జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం కేరళలో మొత్తం 2.69 కోట్ల ఓటర్లు ఉండగా, ‘సర్’ తర్వాత 9 లక్షల ఓట్లను తొలగించారు. కేరళలో గతేడాది నవంబర్ 4 నుంచి ఈ ఏడాది జనవరి 30 వరకు ‘సర్’ నిర్వహించారు.
తాజా జాబితా ప్రకారం కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,69,53,644. ఇందులో పురుష ఓటర్లు 1,31,26,04, స్త్రీ ఓటర్లు 1,38,27,319 మంది. కాగా, 227 మంది ఇతర జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇందులో 18-19 ఏళ్లలోపు ఓటర్లు 4,24,518 మంది ఉన్నారు. ఈ జాబితాకు ముందు డిసెంబర్ 23, 2025 న డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశారు. అప్పుడు ఓటర్ల జాబితా 2,54,42,352గా తేలింది. ఆ తర్వాత రివిజన్ సమయంలో కూడా 53,229 ఓట్లను తొలగించారు. ఆ తర్వాత రివిజన్ సందర్భంగా 13,51,151 ఓటర్ల ఫాం 6 అప్లికేషన్లను, 1,59,111 ఫాం 6-ఏ అప్లికేషన్లు ఆమోదించారు. ఆ తర్వాత 3,93,333 ఓటర్ల ఫాం 8 అప్లికేషన్లు ఆమోదించారు. దీని తర్వాత తుది జాబితా సిద్ధమైంది. తుది జాబితాను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఆఫీసర్స్ వద్ద చూసుకోవచ్చు.
అలాగే కేరళ ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఓటరు గుర్తింపు కార్డు అందుకోని 18-19 ఏళ్ల వయసు వారికి సొంత అడ్రస్‌కు కార్డులు అందుతాయి. ఈ జాబితా తర్వాత.. అంటే ఈ ఏడాది జనవరి 1 తర్వాత 18 ఏళ్లు నిండిన వాళ్లు ఆన్లైన్లో తమ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.