గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Oct 04, 2020 , 00:17:24

100 శాతం తాగునీరు అందించాలి

100 శాతం తాగునీరు అందించాలి

  •  సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు 
  •  సింగూరులో 25 టీఎంసీల నీరు

సంగారెడ్డి టౌన్‌ : మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు వంద శాతం తాగునీరు అందించాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈలు, ఏఈలతో మిషన్‌ భగీరథ పనుల పూర్తి, పెండింగ్‌ పనులు, ఓహెచ్‌ఆర్‌ఎస్‌లు, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ నీరు అందుతున్నది, లేనిది, అందుకు కారణాలు తదితర అంశాలపై మండలాల వారీగా కలెక్టర్‌ సమీక్షించారు. గత ఏడాది నీటి ఎద్దడి ఎదుర్కొని, నీటి సమస్యను అధిగమించేందుకు సమర్థవంతంగా పనిచేశారని కలెక్టర్‌  అభినందించారు. అందుకు జిల్లా ప్రజలు సహకరించారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి ఓహెచ్‌ఆర్‌ఎస్‌లు, మెయిన్‌, సెకెండరీ లైన్‌, నల్లాలు బిగించడం, కనెక్షన్‌ ఇవ్వడం లాంటి అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. 

సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 25టీఎంసీల నీరు చేరిందని, తాగు నీటికి ఎలాంటి సమస్య లేదన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాలన్నారు. ర్యాండమ్‌గా కొన్ని  పంచాయతీల సర్పంచులతో ఫోన్లో మాట్లాడి   మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయా? మిషన్‌ భగీరథ పనులు పూర్తి అయ్యాయా?  వివరాలను కలెక్టర్‌ ఆరా తీశారు. ప్రజలకు భగీరథ నీళ్లు అందించకపోతే సంబంధిత డీఈలు, ఏఈలు బాధ్యులు అవుతారని కలెక్టర్‌ స్పష్టం చేశారు.  సమీక్షలో ఆర్‌డబ్య్లూఎస్‌ ఇన్‌చార్జి ఎస్సీ రఘువీర్‌, డీఈలు, ఏఈలు, గ్రిడ్‌ అధికారులు పాల్గొన్నారు. 


logo