వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. వనపర్తి (Wanaparthy) మండలం పెద్దగూడెం తండాకు చెందిన గిరిజన రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ధర్నా చేపట్టారు. నెల రోజుల క్రితం వరిచేలు కోసినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, ఆ ఒక్కరోజే 140 సంచుల ధాన్యం తూకం వేసి నిలిపివేశారని చెప్పారు.
పొరుగున్న ఉన్న కృష్ణగిరి తండా నుంచి 730 సంచుల ధాన్యం తూకం వేసి పెబ్బేరు మండలం సేరుపల్లి రైస్ మిల్లుకు పంపించామని, అందులో 20 సంచులు తరుగు పేరుతో మిల్లు యజమాని అదనంగా తీసుకున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటలను ఇలా మిల్లర్లు తరుగు పేరుతో దోపిడీ చేస్తే రైతులు ఎలా తట్టుకుంటారని ప్రశ్నించారు. కాగా, ధర్నా విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధాన్యం కొనుగోలు చేయిస్తామని, మిల్లర్‌కు కాకుండా ప్రభుత్వం నిల్వ చేసే గోదాముకు ధన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.