వనపర్తి: పండిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు (Paddy Procurement) చేయాలని డిమాండ్ చేస్తూ ఏదుల మండలంలోని సింగాయపల్లి రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై వంటా వార్పు చేపట్టి నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో 25 రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ఆలస్యంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని రైతుల ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం ఒక్క లారీ ఒడ్లు మాత్రమే తూకం వేసి పంపించారని, వాటిని కూడా దింపకుండా తాలు ఉందని రైస్ మిల్లరు మొండికేయడం సబబు కాదన్నారు.
వడ్లు తూర్పు పట్టాలని అధికారులు మిషన్ పంపించారని అది ఎంత మాత్రం సాధ్యం కాదని వెల్లడించారు. గత పదేండ్లుగా వరి ధాన్యం అమ్మకాలు చేపడుతున్న క్రమంలో కొత్తగా ప్రభుత్వం తూర్పు పట్టాలంటూ మిషన్లను పంపడం సరి అయింది కాదని రైతులు రోడ్డు పైన బైఠాయించారు. ఎలాంటి షరతులు లేకుండా వడ్లు కొనుగోలు చేసేదాకా తాము ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. దీంతో అక్కడి చేరుకున్న ఏదుల ఎస్ఐ, ఐకేపీ అధికారులు రైతులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.