Chittem Rammohan Reddy | మక్తల్, డిసెంబర్ 02 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మక్తల్లో చేపట్టిన విజయోత్సవ సభ నిర్వహిస్తారని.. దేంట్లో విజయం సాధించారని విజయోత్సవ సభల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సభలు పెడుతున్నారని నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిలు అన్నారు.
మంగళవారం చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే విజయోత్సవ సభలో భాగంగా మక్తల్లో చేపట్టిన విజయోత్సవ సభకు ప్రజలు లేక సభ తుస్సుమన్నదని అన్నారు. ఈ ప్రభుత్వం దేంట్లో విజయం సాధించిందో అర్థం కాలేదని పేర్కొన్నారు. నిన్న ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇరిగేషన్, విద్యా వ్యవస్థ పూర్తి చేశాం అని డొంకతిరుగుడు మాటలు మాట్లాడారని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 85% పూర్తయిందని, ఈ రెండేళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఏమైనా చేపట్టారా..? అని ప్రశ్నించారు. ఎక్కడ కూడా ఒక తట్టెడు మన్ను కూడా తీయలేదు కానీ రాష్ట్రంలో ఇరిగేషన్ పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అనడం సిగ్గుచేటైన విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటూ స్థానిక మంత్రి మాట్లాడడం చూస్తుంటే వీళ్లు ఎక్కడ నీళ్ళు ఇచ్చారూ ఒక ఎకరాన్నైనా తడిపారా..? అని ప్రశ్నిస్తున్నానని రాజేందర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే కమిషన్ల కోసం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును జీవో నెంబర్ 69 పేరిట తెరమీదకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారి జేబులు నింపుకోవడానికి ప్రాజెక్టును కొత్తగా నిర్మిస్తున్నామని చెప్తున్నారు తప్ప ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ అనుమతులు లేవన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటగా 1600 కోట్లు అని, తర్వాత రూ.2800కోట్లు, ఆ తర్వాత 4200 కోట్లు నిధులు కేటాయించామని, ప్రస్తుతం మాత్రం 5400 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నామని అనడం చూస్తుంటే వీరికి ప్రాజెక్టు నుండి కమిషన్ ఎంతవరకు దోచుకోవాలనే ఆలోచన తప్ప మరి ఇంకేమీ లేదని అన్నారు.
రైతులకు న్యాయం చేయమంటే కేసులు..
ప్రాజెక్టు కోసం కేవలం పైపులు మాత్రమే చూపించి బిల్లులు తీసుకుంటున్నారని అన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కి సీడబ్ల్యుసి , ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, డీపీఆర్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు ద్వారా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చి, కొడంగల్ నియోజకవర్గాన్ని శశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటైన విషయం అన్నారు. ఈ ప్రాజెక్టు పేరు మీద ఇప్పటికే ఈ నాయకులు 700 నుండి 800 కోట్ల బిల్లులు ఎత్తుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వానకాలం సీజన్లో రైతుల పండించిన పత్తిని మిల్లర్లు తీసుకోకపోతే రైతుల పక్షాన నిలబడ్డటువంటి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టించింది మీ ప్రభుత్వం కాదా, రైతులకు న్యాయం చేయమని అడిగే వారిపై కేసులు చేయడం మీ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. గతంలో కొన్నటువంటి వడ్లకు రైతులకు 1150 కోట్ల బోనస్ బకాయిలను అందించాలని, వాటి ఊసేత్తాకుండా రేవంత్ రెడ్డి ఇరిగేషన్, విద్యా వ్యవస్థ పూర్తి చేశామని అనడం ఎంతవరకు సమంజసంమన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి 210 కోట్లతో నారాయణపేట- మక్తల్ రోడ్డు ను నాలుగు లైన్లు అభివృద్ధి చేస్తామని సభలో ప్రసంగించారని. ఎప్పుడు రోడ్డును పూర్తి చేస్తారో ప్రజలకు మంత్రి చెప్పాలని అన్నారు. నాలుగు లైన్ల రోడ్డు వేసేది దేవుడు ఎరుగునని, ప్రస్తుతం నారాయణపేట రోడ్డుపై ఫీట్ లోతులో ఉన్నటువంటి గుంతలను ఎప్పుడు పూడుస్తారో మంత్రి చెప్పాలని అన్నారు. పాలమూరులో ఐఐటీ కాలేజీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పే మాటలు చూస్తుంటే ఐఐటీ అనుమతులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని కనీసం ఐఐటీ పరిజ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటనే విషయమని అన్నారు.
మరోసారి ప్రజలను మోసం చేసేందుకు..
గత ప్రభుత్వంలో నారాయణపేటకు తీసుకు వచ్చినటువంటి అగ్రికల్చర్ కళాశాలను తీసుకువెళ్లి వనపర్తిలో పెట్టింది ఈ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, శోచాయించుకొని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని, అవేవి నెరవేర్చకుండా రెండేళ్ల పాలన పూర్తయిన వేళ విజయోత్సవాల పేరిట మరొకసారి ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజలను మోసం చేయాలని చూస్తే ప్రజలు మరొక్కసారి కాంగ్రెస్ చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.
Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా