Road accident : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న కార్లు, బైకులను ఢీకొట్టింది. జూబ్లిహిల్స్ రోడ్ నెం.45 లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డదిడ్డంగా పడిపోవడంతో రోడ్ నెం.45లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
ప్రమాదంవల్ల రోడ్ నెం. 45 నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి నుంచి రోడ్ నెం.45 వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. వాహనదారులు ఈ మార్గాలను తప్పించి ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. కాగా ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.