AP News : పిడుగు శబ్దాన్ని తట్టుకోలేక ఆ ముసలి గుండెలు ఆగిపోయాయి. పలపలమంటూ వచ్చిన పేద్ద పిడుగు చప్పుడుకు ఉలిక్కిపడి ఇద్దరు వృద్ధురాళ్లు ప్రాణాలు విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని రెండు పక్కపక్క గ్రామాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా వృద్ధురాళ్ల మృతి ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన తల్లపనేని నాగమ్మ (63) పిడుగుపాటుతో సంభవించిన భారీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే ఆమె గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
అదేవిధంగా సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో మేకల వెంకాయమ్మ (60) కూడా పిడుగు శబ్దానికి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ వెంటనే ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. పిడుగుల ధాటికి వెలువడిన భారీ శబ్దాల కారణంగానే తమ వారు మరణించారని మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.