Mammootty | మలయాళ చిత్ర పరిశ్రమలో మరో అరుదైన మరియు అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. లెజెండరీ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పాదయాత్ర’ (Padayaatra) అధికారిక ట్రైలర్ విడుదలైంది.
ఈ చిత్రంతో వీరిద్దరి కాంబినేషన్ దాదాపు 32 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతుండటం విశేషం. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘అనంతరం’, ‘మతిలుకల్’, ‘విధేయన్’ (1994) వంటి సినిమాలు మలయాళ చలనచిత్ర చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా అడూర్ సినిమాల ద్వారానే మమ్ముట్టికి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు జాతీయ అవార్డులు కూడా వరించాయి. దీంతో ఈ తాజా ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్రైలర్‌ను బట్టి ఈ చిత్రంలో మమ్ముట్టి ఒక ఆదర్శప్రాయమైన డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం సాధారణ సినిమా కాకుండా, ఒక కాంప్లెక్స్ కల్చరల్ బ్యాక్‌డ్రాప్ మరియు సోషియో-పొలిటికల్ అంశాలతో కూడిన పవర్ఫుల్ డ్రామాగా తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. ఒక మావోయిస్ట్ దాడి, దేశద్రోహం (Sedition) ఆరోపణలు, మరియు పోలీస్ విచారణ వంటి తీవ్రమైన సంఘటనల చుట్టూ కథ నడుస్తుందని ట్రైలర్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇందులో మమ్ముట్టి చెప్పే “కాలం మారదు, మనమే మారుతాం” అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.
‘మమ్ముట్టి కంపెనీ’ (Mammootty Kampany) పతాకంపై స్వయంగా మమ్ముట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇది ఈ బ్యానర్లో 8వ సినిమాగా వస్తోంది. ఈ చిత్రంలో గ్రేస్ ఆంటోని, ఇంద్రన్స్, జగదీష్, జయశంకర్, జీనత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.