Chittem Rammohan Reddy | మక్తల్, జూలై 15 : రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి రైతు కష్టం గురించి ఏ మాత్రం తెలియదని.. రైతుల పంటను రైతుల రక్తంతో పారబెడితే పండుతుందనడం సిగ్గు చేటైన విషయం అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
బుధవారం సాయంత్రం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన నివాస గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం నమోదు కాక ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరు లేక ఎండిపోతుంటే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతుల పంటలు కాపాడుకోవాలంటే రైతుల రక్తంతో పంటను కాపాడుకోవాలని మాట్లాడడం చూస్తుంటే, ఈ ముఖ్యమంత్రి తన పరిపాలన ఒత్తిడి అంతా రైతులపై వేస్తున్నారని అర్థమవుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల రక్తంతో పంట పండించాలని అనడం సిగ్గుచేటైన విషయం అన్నారు.
భారతదేశ స్వతంత్రంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, రైతుల రక్తంతో పంటను పండించాలి అనే పదాన్ని వాడలేదని చిట్టెం గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పైకి వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడని, ఆయనకు వ్యవసాయం చేసే రైతుల కష్టాలు ఏమాత్రం తెలియదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు చెంతనే ఉండి పరిపాలన అందిస్తున్నామని ప్రగల్బాలు పలికే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రజా ప్రభుత్వంలో, రైతుల రక్తంతో పంటలు పండించాలా ఇదేనా మీ ప్రజా ప్రభుత్వమని ప్రశ్నించారు.
నీటిని విడుదల చేసే సత్తా లేని ముఖ్యమంత్రి..
ప్రస్తుతం కృష్ణా, బీమా నదులలో నీరు లేక రైతులు పంటలు సాగు చేసుకుందామని వరి తుకాలు పోసుకుంటే, నాటు వేసుకోవడానికి నీళ్లు లేక తీవ్ర అరిగోస పడాల్సిన పరిస్థితిలో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లకు రోజు 80 వేల క్యూసెక్కుల, వరద నీరు వచ్చి ప్రాజెక్టులలో చేరుతుందని, ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, తెలంగాణ ప్రాంతానికి నీటిని విడుదల చేసే సత్తా లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతుల రక్తంతో పంటలు పండించుకోవాలనడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో రైతన్నలే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు.
మక్తల్ నియోజకవర్గంలో కుసుమూర్తి నుండి పసుపుల వరకు లిఫ్టులను ఏర్పాటు చేసింది అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అన్న విషయాన్ని, మంత్రి వాకిడి శ్రీహరి మర్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి రైతులపై అసత్య ఆరోపణలు చేయకుండా, రైతులకు పంటలను కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడతారో బహిర్గతం చేయాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమై, నాట్లు వేసుకునే సమయంలో వ్యవసాయ అధికారులు, రైతులకు ఆరుతడి పంటలు వేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పడం చూస్తుంటే, ప్రభుత్వంతోపాటు వ్యవసాయ అధికారులకు సైతం రైతులపై ఎలాంటి మమకారం లేదని విషయం అర్థమవుతుందని చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.