నిర్మల్ : జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేట్ వైఎస్సార్ నగర్ కాలనీ సమీపంలో ఓ యువకుడి ని దుండగులు దారుణంగా హత్య ( Murders ) చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అదే కాలనీకి చెందిన అస్లం (23) అనే యువకుడు ఆటోలో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వాహనంలో వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. మెడ, కడుపులో కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.
గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.