మక్తల్, మే 30: నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలో ఇసుకాసురుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేన్నప్పటికీ రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తూ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో టిప్పర్లు తిప్పుతున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మక్తల్ మండలం గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు.
మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేనప్పటికీ ఇసుక రవాణా చేస్తూ జేబులో నింపుకోవాలనే లక్ష్యంతో అధికారుల కన్ను కప్పి ఇసుకను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జాతీయ రహదారిపై టిప్పర్ డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్తున్న క్రమంలో మక్తల్ మండలం మంతన్ గౌడ్ గ్రామానికి చెందిన గోసాయి అంజప్ప (47) మృతిచెందారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మంతన్ గౌడ్ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.
అధికార పార్టీలో ఉన్నామంటూ తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఇసుక రీచ్లు నడపడంతోపాటు, అనుమతులు లేకున్నప్పటికీ రాత్రి సమయంలో వందలాది టిప్పర్లతో ఇసుకను రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం మక్తల్ మండలం జక్లేర్ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సును మరో టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో బస్సు వెనుక భాగం దెబ్బ తిన్నదని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.