మాగనూరు నవంబర్ 09: పత్తి రైతుల నుండి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని నారాయణపేట జిల్లా మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల రైతులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు నుండి 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాల్సి ఉండగా సిసిఐ కేంద్రాలు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సరైనది కాదన్నారు. కాపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ 7 క్వింటాళ్లకు పరిమితం చేశారని, మరి మిగతా పంటను ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు.
మధ్య దళారుల దోపిడీకి రైతులను బలి చేయడానికే ఇటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారని విమర్శించారు.మరోవైపు తేమ శాతం ఎక్కువ ఉందనే పేరుతో రైతుల నుండి పత్తిని సేకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి పూర్తిస్థాయిలో పత్తిని కొనుగోలు చేయకుండా, ఇదే సమయంలో పత్తి దిగుమతులపై సుంకాలను ఎత్తివేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.
విదేశాల నుండి దిగుమతులను ప్రోత్సహిస్తే దేశంలోని స్వదేశీ రైతులు గిట్టుబాటు ధర రాక ఇబ్బందుల పాలవుతారన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. స్వదేశీ రైతుల పొట్ట కోట్టి విదేశీయులుకు ఎర్ర తివాచి పరచడమే దేశభక్తా అని నిలదీశారు. ప్రతి రైతు దగ్గర 12 క్వింటాళ్లు కొనుగోలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులను కలుపుకొని ఆందోళనలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.