మక్తల్, మార్చి 24: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తుంది తప్ప అమలు చేయడంలేదని మాచీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరులో జరిగిన వివాహ వేడుకలకు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయిందన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డ పెండ్లికి కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అందిస్తామని గ్యారెంటీ లేని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడిచినప్పటికీ దానిని నెరవేర్చడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లిని సంతోషంగా చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. మేనమామ కానుకగా రూ.లక్ష 116 అందించి ఆడబిడ్డ పెండ్లికి పెద్దదిక్కయ్యారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అర్జీ పెట్టుకున్న వారికి పాత పద్ధతి ప్రకారంగానే రేవంత్ రెడ్డి సర్కార్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించింది తప్ప, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం చెక్కుతోపాటు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వెంబడి బీఆర్ఎస్ నాయకులు రాజుల ఆశి రెడ్డి, గాల్ రెడ్డి, నరసింహారెడ్డి, శివ లతోపాటు తదితరులు ఉన్నారు.