Chittem rammohan reddy | మక్తల్, జనవరి 29 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి చావు అంచుకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన నిప్పులాంటి నేత కేసీఆర్‌పై కాంగ్రెస్ సిట్ నోటీసులు జారీ చేయడం సిగ్గు చేటైన విషయమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ దార్శనికుడు కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీచేసిన విధానాన్ని నిరసిస్తూ.. గురువారం చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర వలస పాలకుల చెరల నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి కల్పించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే తపనతో కేసీఆర్ చావు అంచుకు వెళ్లి, తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నిప్పులాంటి నేతపై తప్పుడు ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
విచారణ పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళ్లేశ్వరంలో అవినీతి జరిగిందంటూ, 600కు పైగా పేజీలతో నివేదికను అందించామని.. రేవంత్ రెడ్డి దొంగబుద్ధితో కేసీఆర్‌ను, కేసీఆర్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని నిందించాలనే పన్నాగం పన్నినప్పటికీ, ఎలాంటి అవినీతి కాళేశ్వరంలో జరగలేదని నివేదికలు వచ్చాయి. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతతోపాటు, తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు కష్టపడినట్వంటి మాజీ మంత్రులు ఉద్యమ నాయకులు, హరీష్ రావు, కేటీఆర్‌లకు సైతం సిట్ నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో నాటకాలాడుతున్న, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
25 నెలల ప్రజాపాలన ఏం సాధించిందని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, సిట్ నోటీసులు జారీ చేసిన వెంటనే మరుసటిరోజే విచారణకు హాజరు కావాలనడం, విచారణలో ఏం తప్పు తేలక పోవడంతో, మరొక మాజీ మంత్రి కేటీఆర్‌కు సీట్ నోటీసులు పంపి, మరుసటి రోజే విచారణకు హాజరుకావాలని ఈ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు.
హరీష్ రావు, కేటీఆర్‌లు సిట్ విచారణకు వెళ్లి కడిగిన ముత్యం లాగే బయటికి వచ్చిన వెంటనే జీర్ణించుకోలేక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంతోష్ రావుకు సైతం నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ముగ్గురికి జారీ చేసిన నోటీసులలో విచారణకు హాజరైనా ఏమి తేలకపోవడంతో, తెలంగాణ సాధించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అన్నారు. ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి బావమరిది సింగరేణి కాంట్రాక్టర్ దక్కించుకున్నందుకు, ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై, ప్రభుత్వం సిట్ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పతనానికి చరమగీతం పాడేందుకు సిద్ధం..
ప్రజా పాలనలో ప్రశ్నించే గొంతుకలు ఉండరాదని అక్కసుతో, రేవంత్ రెడ్డి సిట్ పేరుతో విచారణ నోటీసులు అందిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25 నెలల్లో అందిన కాడికి దోచుకో దాచుకో అనే తీరులో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను ప్రశ్నిస్తే, సిట్ పేరుతో ప్రశ్నించే గొంతుకలను అణచలేరని పేర్కొన్నారు. గతంలో 50 లక్షలతో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ దొంగ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపు నుండి తప్పుడు ఆరోపణలు చేసేందుకు, సిట్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడితే, తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా అవుతుందని అన్నారు.
తెలంగాణ దార్శనికుడు కేసీఆర్ వెంబడి 60 లక్షల గులాబీ సైన్యం ఉన్నదని, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ గులాబీ సైన్యం, కాంగ్రెస్ పార్టీ పతనానికి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. విలేకరుల సమావేశం అనంతరం సిట్ నోటీసులకు వ్యతిరేకంగా, ఫ్ల కార్డులు, నల్ల బ్యాడ్జీలు ధరించి చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసం నుండి ఆయనతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్‌లు జాతీయ రహదారిపై నిరసన ర్యాలీగా వెళ్లి, నారాయణపేట చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, సర్పంచులు గాల్ రెడ్డి, రవితేజ, శ్రవణ్ కుమార్, ఆంజనేయులు గౌడ్, వీరారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, నాయకులు ఈశ్వర్ యాదవ్, నరేందర్ రెడ్డి, వినోద్, శ్రీనివాస్ గౌడ్, బాలప్ప, సురేష్, అశోక్ గౌడ్ తదితరులున్నారు.

