అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చెప్పారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలనే ఉద్దేశంతో సౌకర్యాలను మెరుగుపరిచినట్లు వివరించారు. శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం, దోమలపెంట ప్రభుత్వ ప్రాజెక్టు ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు.
తాగునీటి సదుపాయం, గాలి, వెలుతురు లాంటి అంశాలను పర్యవేక్షించిన కలెక్టర్.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల పట్ల విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.