కొల్లాపూర్, మార్చి 30 : మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు కోనమోని శ్రీనివాసులు(55) శుక్రవారం మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలపురం గ్రామానికి శ్రీనివాసులు కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో రూ 3,50,000 నగదు చెల్లించి 20 ఎకరాల మామిడి తోటను కౌలు తీసుకున్నారు. దాదాపు మామిడి తోట పై ఐదు నుంచి ఆరు లక్షల వరకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినా మామిడి తోటకు పూత రాలేదు.
దీంతో 13 లక్షలు దాక అప్పుల మీద పడతాయని భయంతో వేపూరు గ్రామంలో కౌలుకు తీసుకున్న మామిడి తోటలో చెట్టుకు తన పంచతోనే ఉరివేసుకున్నారు. అయితే తోటకు వెళ్లిన కోనమోని శ్రీనివాసులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పక్క తోటను కౌలుకు తీసుకున్న రైతుకు ఫోన్ చేశారు. తమ తోటలోకి వెళ్లి చూడమని చెప్పడంతో అతను వెళ్లి చూడగా తోటలో శ్రీనివాసులు విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. పంట దిగుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ నాయకుడు శ్రీనివాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.