ఊట్కూర్, జూన్11: ప్రభుత్వ బడులలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తూ ప్రతిభకు నిలయాలుగా ఉంటాయని తహసీల్దార్ చింత రవి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పగిడిమారి గ్రామంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న బడిబాట ప్రచార రథాన్ని తహసీల్దార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, తపస్ జిల్లా సమన్వయ కర్త నర్సింగప్ప పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులల్లో నమోదును శాతాన్ని పెంచి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఈ ప్రచార రథం జిల్లాలోని గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని, ప్రభుత్వం పాఠశాలలకు కల్పిస్తున్న వసతులను ప్రజలకు తెలియపరుస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంపే లక్ష్యంగా యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల, చిన్నపొర్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. తపస్ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని ఉపాధ్యాయులు కొనియాడారు. కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు కృష్ణ, నాయకులు రఘురామేశ్వర్, కల్పన, బాలు, ఉపాధ్యాయులు మహేందర్, నవనీత, విజయ్ పాల్గొన్నారు.