నాగర్ కర్నూల్ : సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులన్నీంటిని అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత సమయంలో గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మంజూరు చేసి చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీరాజ్ ద్వారా రూ.25.12కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రూ.21కోట్లతో గ్రామ పరిధిలో నాలుగు కిలోమీటర్ల వరకు నాలుగు వరుసల రహదారి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన గ్రామంలో తాగునీటి అవసరాల కోసం రూ.3కోట్ల చేపట్టిన పనుల పురోగతి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూ.2.85 కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని చెప్పారు.
కొండారెడ్డిపల్లి గ్రామంలో 515 ఇండ్లకు సోలార్ పనులను ప్రతిపాదించగా ఇప్పటివరకు 407 ఇండ్ల పనులు చేపట్టామని.. మిగతా ఇండ్లకు సైతం సౌకర్యం కల్పించి వందశాతం పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనులపై నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పనుల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని అదనపు కలెక్టర్ దేవ సహాయానికి సూచించారు.