తల్లాడ, మార్చి 5 : ఖమ్మం జిల్లా తల్లాడ రేంజ్ పరిధిలోని కనకగిరి అడవుల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయి. వన్యప్రాణులు, అడవుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో చిరుతల ఆనవాళ్లు నిక్షిప్తమైనట్టు తల్లాడ అటవీ శాఖ అధికారులు గురువారం తెలిపారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో శివారు గ్రామాల ప్రజలు రాత్రివేళ ఒంటరిగా తిరగొద్దని, పశువుల కాపరులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
నల్లమలలో కనిపించిన పులి
అర్ధరాత్రి శ్రీశైలం రహదారిపై ప్రత్యక్షం
నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి పులి కనిపించింది. ఈ పెద్దపులి అటవీ శాఖ అధికారుల కంటపడింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గుండం సమీపంలో అటవీ అధికారులు డ్రోన్ సర్వే కోసం సఫారీ వాహనంలో వెళ్తుండగా.. పులి వారి ప్రత్యక్షమైంది. వాహనాల లైట్ల వెలుగులో దర్జాగా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి.. అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని అధికారులు వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.