పెగడపల్లి, మార్చి 5 : అనారోగ్యంతో భర్త మృతి చెందిన ఐదు గంటల వ్యవధిలోనే భార్య చనిపోవడం కలచివేసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన సురకంటి చుక్కరెడ్డి (85), శంకరవ్వ (78) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. బిడ్డలకు పెండ్లిండ్లు కాగా కొడుకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చుక్కరెడ్డి, బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో మరణించాడు. భర్త మృతిని భార్య తట్టుకోలేకపోయింది. తీవ్రంగా కుంగిపోయిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో కుప్పకూలింది. ఐదు గంటల్లోనే ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు.