Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వేలాది మంది పోలీసుల పహారాలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను సందర్శించడం సిగ్గుచేటు అని విమర్శించారు. పాలమూరు ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తుందో స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే నాగర్‌కర్నూల్ జిల్లాలోకి అడుగుపెట్టాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతుబంధు వంటి పథకాలు అందక రైతుల జీవితాలు కన్నీటుపాలయ్యాయని, వారిని పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ నైజం బయటపడిందని అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మొద్దునిద్ర లేసి పాలమూరు ప్రాజెక్టుల పర్యటన పెట్టుకోవడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రయోజనాల కోసం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని కోరుతూ BRS పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఒక పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని తెలిపారు. అయితే, ఈ సమాచారం తెలుసుకున్న ప్రభుత్వం, కేవలం రాజకీయ ప్రదర్శనల కోసమే రేవంత్ రెడ్డిని ఇక్కడికి పంపుతోందని విమర్శించారు.
కందనూలు (నాగర్‌కర్నూలు) జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే.. ఈ జిల్లాను అభివృద్దిలో ఉరుకులు పెట్టటిస్తాడని అనుకున్నామని తెలిపారు. కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి శిలఫలకాలు పెట్టడం తప్ప ఈ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులను పూర్తి చేసిన పాలమూరు వరప్రదాయిని అయినా పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పండబెట్టి ఈ ప్రాంతాన్ని ఎండబెడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
పాలమూరు జిల్లా వలసలను ఆపాలని KCR ఆకాంక్షిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ఎండబెట్టి ప్రజలను వలస బాట పట్టించాలని ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూనుకున్నారని అన్నారు. ప్రాజెక్ట్ వెంటనే పూర్తి అయితే కమీషన్ ఎక్కువగా రాదనే ఉద్దేశంలో కావాలనే ప్రాజెక్టు పనులను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అయితేనే ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచుకుని కమీషన్లను పంచుకోవచ్చనే ఆలోచన తోనే ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు.
కేవలం విహారయాత్ర కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పర్యటనకు వస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించి, పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను హరించే ప్రయత్నమేనని ఆరోపించారు.