బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు, ఆల్ సెయింట్ హైస్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న ప్రతి గదికి వెళ్లి ఆయన పరిశీలించారు.
ఇవాళ పదవ తరగతి బయోసైన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర సౌకర్యాలు, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలని ఆదేశించారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూడాలని డీఈవో చెప్పారు. పాలెం పాఠశాలలో 206 మంది విద్యార్థులకు 206 మంది విద్యార్థులు, బిజినేపల్లి బాలికల పాఠశాలలో 170 మంది విద్యార్థులకు 170 మంది విద్యార్థులు, బాలుర ఉన్నత పాఠశాలలో 156 మంది విద్యార్థులకు 155 మంది విద్యార్థులు, అల్ సెయింట్ హైస్కూల్లో 200 మంది విద్యార్థులకు 200 మంది విద్యార్థులు బయోసైన్స్ పరీక్షకు హాజరయ్యారని డీఈవో తెలిపారు. వారి వెంట నరహరి అంజయ్య తదితరులు ఉన్నారు.