వెల్దండ, జూన్ 6: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda) మండల కేంద్రంలో చర్చి సమీపంలో ఉండే జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై వీధి కుక్కలు దాడి చేశాయి. రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 10కి పైగా వీధి కుక్కలు ఆయన మీదపడి ముఖంపై దాడి చేశాయి. గమనించిన కుటుంబ సభ్యులు కుక్కలను తరిమికొట్టి తీవ్ర గాయాలైన ఆంధ్రయను కల్వకుర్తి దవాఖానకు తరలించారు.
అయితే మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నాగర్ కర్నూలుకు వైద్యులు రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుక్కల స్వైర విహారంపై ఎన్నో మార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు.