– యూరియా ఆన్లైన్ యాప్ను ఎత్తివేయాలి
– రైతులకు శ్రేయస్సు కోసం న్యాయ పోరాటం
– రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మిర్యాలగూడ, ఫిబ్రవరి 23 : ఆన్లైన్ యాప్లో యూరియా నమోదు ప్రక్రియను ఎత్తివేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో రైతుల శ్రేయస్సు కోసం, ఒక రైతుగా న్యాయ పోరాటం చేస్తానని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానికంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయానికి యాసంగి సీజన్లో ప్రతి ఎకరాకు మూడు బస్తాల యూరియా తప్పనిసరి అన్నారు. తనకు 18.18 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, యూరియా కోసం ఆన్ లైన్ లోయాప్ ద్వారా దరఖాస్తు చేయగా కేవలం 12 యూరియా బస్తాలే సరఫరా చేశారని, మిగిలిన యూరియా బస్తాలు నేటికీ అందలేదన్నారు. 15 రోజుల తదుపరి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సలహా ఇచ్చారని, తద్వారా తీవ్రమైన పంట నష్టం జరగడంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందన్నారు.
యూరియా నమోదు యాప్ దరఖాస్తు చేసే సమయంలో సెకండ్స్ లలో యాప్ తొలగిపోతుందన్నారు. సుమారు 90 శాతం మంది రైతులు స్మార్ట్ ఫోన్లు లేనివారు ఉన్నారని, అక్షరాస్యత లేని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియదని ఆయన అన్నారు. యాప్ ద్వారా యూరియా కొనుగోలు కంటే ట్రాన్స్ పోర్ట్ చార్జీల ధర ఎక్కువైతుందన్నారు. చిన్న రైతులకు, ఎన్నారై రైతుల భూములను కౌలు చేసే రైతులకు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. యూరియా బుక్ చేసుకుంటే ఓటిపి ఎన్నారైలకు వెళుతుందని, ఆలోపే యూరియా స్టాక్ లేదని, యాప్ తొలగిపోతుందన్నారు. తరచుగా ఆన్ లైన్ లో సర్వర్ వైఫల్యాలు సాంకేతిక లోపాలు సంభవిస్తున్నాయన్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో రైతులు యూరియా బుకింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఆన్ లైన్ బిజీగా ఉండి నమోదు చేసుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
యూరియా యాప్ నుండి అసైన్డ్ భూములకు పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాప్ లో అసైన్డ్ ల్యాండ్ ఆప్షన్ లేకపోవడం వల్ల అసైన్డ్ భూములు సాగు చేసుకునే రైతులు యూరియాకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు పొట్ట దశ కంటే ముందే యూరియా అవసరం చాలా ఉందని, చాలామంది రైతులకు పొట్ట దశలో ఉన్న పంటలకు ఒక యూరియా బస్తా కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావలసినంత యూరియా వెంటనే అందించాలని, లేకుంటే పంటల దిగుబడి తగ్గుతుందని, రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. వ్యవసాయ ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని వెంటనే యూరియా యాప్ ను ఎత్తివేయాలని, రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్, నల్లగొండ జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ నల్లగొండ జిల్లా అధికారికి ఈ విషయలపై వినతి పత్రాలను అందజేశామని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకు, రైతుల పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు వెనకాడనని చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట రైతు ప్రతినిధులు హాతిరాం నాయక్, మాజీ సర్పంచ్ రవీందర్ ఉన్నారు.