నిజాంపేట,ఆగస్టు18 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం రైతుల పాలిట శాపంగా మారింది. వివరాలు.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట పీఏసీఎస్ సొసైటీకి మంగళవారం 550 యూరియా బస్తాల లోడ్ వచ్చింది. యూరియా యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో 800 యూరియా బస్తాలు బుక్ అయ్యాయి. యూరియా కోసం రైతులు కల్వకుంట పీఏసీఎస్ చేరుకోగా, యూరియా లేదంటూ సిబ్బంది సమాధానం చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. మేం బుక్ చేసుకున్న యూరియా బస్తాలు మాకు కావాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. డీఏవో దేవ్‌కుమార్, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. యూరియా యాప్‌ను తొలిగించి గతంలో మాదిరిగానే భూ పట్టాపాస్‌బుక్ ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
వెల్దుర్తి, ఆగస్టు 18: యూరియా బస్తాల కోసం రైతులు తంటాలు పడుతున్నారు. నేరు గా దుకాణాల నుంచి ఇవ్వకుండా ప్రభుత్వం రూపొందించిన యాప్‌తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఉప్పులింగాపూర్ , మాసాయిపేట పీఏసీఎస్‌లకు 560 బస్తాల చొప్పున యూరియా బస్తాలు వచ్చాయి. ఒక్కో పీఏసీఎస్ పరిధిలో 200 బస్తాల వరకు అధికంగా యాప్‌లో బుకింగ్ జరిగింది. దీంతో సోమవారం కొంత మందికి ఇచ్చిన సొసైటీ సిబ్బం ది, మంగళవారం మరికొంత మందికి యూ రియా బస్తాలను పంపిణీ చేశారు. యూరియా బస్తాలు అయిపోవడంతో బుకిం గ్ చేసుకున్న రైతులు తాము పనులు మానుకొని ఉదయం నుంచి వరుసలో నిల్చున్నామని, తీరా ఇప్పుడు బస్తాలు అయిపోయాయని ఎలా చెబుతారని సొసైటీ సిబ్బంది, వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నేరుగా దుకాణాల నుంచి అసవరమేర బస్తాలు తీసుకునేవాళ్లమని, నేడు యాప్ అంటూ చెప్పి, అందులో బుకింగ్ చేసుకున్నా ఎందుకు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఉప్పులింగాపూర్ సొసైటీ వద్ద బస్తాలు రాని రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి, వెల్దుర్తి- మెదక్ రోడ్డుపై ఆందోళన చేశారు. రైతులకు సొసైటీ సిబ్బంది, వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చజెప్పారు. యాప్ తొలించాలన్నారు. యాప్ ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వ్యవసాయ, సహాకార సంఘా ల అధికారులు, సిబ్బంది వాపోతున్నారు.
చిన్నశంకరంపేట, ఆగస్టు 18 : మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. చిన్నశంకరంపేట ఆగ్రోస్ రైతు కేంద్రం వద్ద మంగళవారం ఉదయం నుంచి యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాశారు. ఫర్టిలైజర్ షాప్‌లో యూరియా కోసం వేచిచూసిన రైతులు, మధ్యాహ్నం అవుతున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రోస్ ఫర్టిలైజర్ నిర్వాహకులు యూరియా అందించలేమని చేతులెత్తేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోసారి ఎంపీపీ కార్యాలయం వద్ద రైతులకు యూరియా అందించేందుకు చర్యలు చేపట్టారు. అక్కడ కూడా క్యూ పెరగడంతో యూరియా అందించే ప్రక్రియను నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఏవో ప్రవీణ్‌కుమార్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు రైతుల రాస్తారోకో కొనసాగడంతో సీఐ సైదానాయక్ వచ్చి రైతులను సముదాయించారు. ఆన్లైన్ బుక్ చేసుకున్న రైతుల పేర్లు నమోదు చేసుకుని బుధవారం యూరియా అందించేందుకు చర్యలు చేపడుతామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
చేగుంట,ఆగస్టు18: యాప్‌లో బుక్ చేసుకొని షాప్ వద్దకు వెళ్తే నోస్టాక్ బోర్డు ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంటలోని ఓ ఫర్టిలెజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయం నుంచే క్యూలో నిలుచున్నారు.వచ్చిన యూరియా కంటే ఎక్కువ యాప్‌లో బుక్ కావడంతో కొందరు రైతులకు దొరక్క పోవడంతో వెనుదిరిగారు. నార్సింగి మండల కేంద్రంలో ఓ షాప్‌కు 500 యూరియా బస్తాలు వస్తే, వెయ్యికి పైగా యాప్‌లో బుక్అయ్యాయి. దీంతో సగమందికి పంపిణీ చేశారు. తాము యాప్‌లో బుక్ చేసుకున్నా యూరియా బస్తాలు ఎక్కడికి పోయాయని ఆందోళన చేపట్టారు. వ్యవసాయ అధికారి భరత్,నార్సింగి ఎస్ఐ సృజన, సీఐ సైదా అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు.